హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఏపీకి ప్రత్యేకహోదాపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు మాట్లాడారు. తర్వాత చర్చ ప్రారంభించిన జగన్, చంద్రబాబు ఓల్డ్ జనరేషన్ అని, ఆయన ఏ విషయాన్నీ అధ్యయనం చేయలేరని అన్నారు. చంద్రబాబులా కాకుండా తము హోమ్ వర్క్ చేసి సభకు వస్తామని జగన్ చెప్పారు. తాము కరెంట్ జనరేషన్ అని, బాబుకు తెలియని ఎన్నో విషయాలు తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు కోసంమాత్రమే చంద్రబాబు హోమ్ వర్క్ చేస్తారని, ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు అవగాహన లేదనిఅన్నారు. ముఖ్యమంత్రికి సగం తెలుసు – సగం తెలిదని, ఆయన ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ, సూట్ కేస్ కంపెనీలపై జగన్ హోమ్ వర్క్ చేస్తారని ఎద్దేవా చేశారు ఆర్థికమంత్రి యనమల. చంద్రబాబు మాట్లాడుతూ, తాను ఔట్ డేటెడ్ కాదని, విలువలున్న నాయకుడినని చెప్పారు. రాష్ట్రానికి ఐటీని పరిచయంచేసిన ఘనత తనదని అన్నారు. జగన్‌ను అమెరికా పంపితే తిరుగుటపాలో వచ్చేశాడని చెప్పారు.
మొత్తానికి నిన్న చెప్పినట్లే జగన్ అసెంబ్లీలో సినిమా చూపిస్తున్నారు…. సభను అల్లకల్లోలం చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై సీఎమ్‌కు, స్పీకర్‌కు ట్యూషన్ చెబుతానని జగన్ నిన్న అసెంబ్లీ లాబీల్లో మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్లే ప్రత్యేకహోదా అంటే ఏమిటి, నీతి ఆయోగ్ అంటే ఏమిటి, ప్రత్యేకహోదావలన ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలను పాయింట్లవారీగా, రాసుకొచ్చిన కాగితాలను చదువుతూ ఏకరువు పెట్టారు.