సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి తన వల్ల కాదని నేరుగా అంగీకరించారు. అమరావతి కట్టలేనని .. విశాఖలో పదివేల కోట్లు పెడితే వరల్డ్ క్లాస్ సిటీ అవుతుందని ప్రకటించారు. మూడున్నరేళ్లుగా ఎందుకు ఆ రూ. పదివేల కోట్లు పెట్టలేదో మాత్రం చెప్పలేదు. పాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన జగన్.. అభివృద్ది విషయంలో తనకేమీ చేతకాదన్నట్లుగానే ఎక్కువగా మాట్లాడారు. చేశానని చెప్పుకున్న కొన్ని పనులు టీడీపీ హయాంలోనివి కావడంతో చూసే వారికి జగన్ పాలనా సామర్థ్యంపై పూర్తి స్థాయిలో అనుమానం వచ్చేలా ప్రసంగం సాగింది. గతంలో కనిపించిన ఫైల్ ఈ సారి జగన్‌లో కనిపించకపోవడంతో ఎమ్మెల్యేలు కూడా పెద్దగా స్పందించలేదు.
80 శాతం ప్రజలు తెల్ల రేషన్ కార్డుదారులని గుర్తు పెట్టుకోవాలన్న సీఎం !
అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు అవుతుందంటూ గతంలో చెప్పిన కబుర్లనే చెప్పిన జగన్.. అది కట్టడానికి మన దగ్గర డబ్బు లేదని తేల్చేశారు. అలా కట్టలేమన్నారు. ఏడాదికి రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగిన బీద రాష్ట్రం ఏపీ అన్నారు. మన రాష్ట్రంలో ప్రజలు ఎనభై శాతం మంది వైట్ కార్డు దారులన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. అంటే ఏపీలో ప్రజంలందరికీ వైట్ కార్డులు ఉంటాయి కాబట్టి రాజధాని కట్టాల్సిన అవసరం లేదన్నట్లుగా జగన్ మాట తీరు ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోయారు.
అమరావతి భూములు ఎవరూ కొనట్లేదు కాబట్టి అంత విలువ లేదని తేల్చిన జగన్ !
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాము ఎకరం పది కోట్లకు అమ్ముతానంటే ఎవరూ కొనడం లేదని.. చిన్న చిన్న స్థలాలు కూడా అమ్ముడుపోవడం లేదని ఇక .. రాజధానికి విలువ ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. విలువ లేని భూముల్లో కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ భూములకు విలువ ఎందుకు తగ్గిపోయిందో జగన్ రెడ్డికి తెలియదని ఎవరూ అనుకోలేరు. కానీ అలా ప్రజల్ని మభ్య పెట్టగలనని మాత్రం జనం అనుకుంటున్నారు. ఇదే అంశంపై మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబు వస్తే పది ఎకరాలున్న రైతు వంద కోట్లు సంపాదించుకుంటానని అన్నారు. అంటే.. జగన్ ఉంటే.. ఎలా ఉంటుందో.. చంద్రబాబు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారన్నమాట. అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ కొంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని చేసి.. అమ్మకానికి పెట్టి ఎవరూ కొనడం లేదు.. దానికి విలువ లేదని జగన్ చెప్పారన్నమాట. ఆయన మాటలు చూసి అమరావతి రైతులే కాదు.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి పనుల్ని తాను చేసినట్లుగా చెప్పుకున్న జగన్ !
రాజధాని ప్రాంతం.. విజుయవాడ, గుంటూరుల్లో చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి పనుల్ని జగన్ తాను చేయించినట్లుగా చెప్పుకున్నారు. చంద్రబాబు ఏమీ చేయలేదని అన్నీ తాము వచ్చినట్లుగా చేశామని ఫోటోలు కూడా ప్రదర్శించారు. చివరికి కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా తామే పూర్తి చేశామని చేశామని… చంద్రబాబు ఏమీ చేయలేదని చెప్పుకున్నారు. ఈ మూడున్నరేళ్లలో జగన్ తాను ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పనినీ తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో చెప్పుకోలేకపోయారు.
తాను చేసినవన్నీ వికేంద్రీకరణ అని చెప్పుకున్న జగన్ !
గత ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున పరిశ్రమలు.. ప్రాజెక్టులు తీసుకు వచ్చి.. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. ఇప్పటికీ టీడీపీ నేతలు తాము ఐదేళ్లలో తెచ్చి ప్రారంభించిన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ .. తాను పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు.. ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ఆర్బీకేలు.. తమ పార్టీ ప్రచారం కోసం ప్రారంభఇంచిన డిజిటల్ లైబ్రరీలను గొప్పగా వికేంద్రీకరణగా చెప్పుకున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేందుకు వెనుకాడని జగన్ !
అమరావతి రైతులు అరసవిల్లి వరకూ న్యాయం కోసం పాదయాత్ర చేస్తూంటే అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు సీఎం జగన్ ఏ మాత్రం వెనుకాడలేదు. వారేదో దండయాత్రకు వస్తున్నట్లుగా.. అక్కడి ప్రజలు కామ్ గా ఉండాలంటున్నారని మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండటంతో ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రేనా అన్న అభిప్రాయం అందరిలో ఏర్పడుతోంది.
అంతిమంగా జగన్ ప్రసంగం.. తాను రాజధాని కట్టలేను.. అని తేల్చేశారు. డబ్బుల్లేవంటారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటారు. దానికి తన వద్ద ఉన్న ప్రణాళికలేమిటో చెప్పలేదు. ఫక్తు రాజకీయం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం అయితే చేశారు.