హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్నారు. రేపు వీళ్ళిద్దరికీ ట్యూషన్ చెబుతానంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటిరోజైన ఇవాళ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య తీవ్ర వాద ప్రతివాదనలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, దూషణలు జరిగాయి. తమ పార్టీ గొంతు నొక్కేస్తున్నారని వైసీపీ మండిపడింది. ఈ సందర్భంగా సమావేశాలు రేపటికి వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన జగన్, కౌరవ సభను చూడలేదుగానీ, ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ శానససభ అంతకన్నా దారుణంగా ఉందన్నారు. కన్ఫ్యూజ్ చేయటం చంద్రబాబు నైజం అని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు రేపు తాను ట్యూషన్(!?@#*@?!) చెబుతానని అన్నారు. మరోవైపు అటు చంద్రబాబుకూడా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ, జగన్లాంటివాళ్ళను తాను చాలామందిని చూశానని చెప్పారు. సంతాప తీర్మానాన్నికూడా రాజకీయం చేయటమేమిటన్నారు. జగన్ గీత దాటితే సహించేది లేదని చెప్పారు. తాను వీఐపీ ఘాట్‌లో చేయకపోవటంపై జగన్ ఆరోపణలు చేస్తున్నారని, మరి జగన్ వీఐపీ ఘాట్లోకాకుండా కొవ్వూరులో ఎందుకు స్నానం చేశారని ప్రశ్నించారు. కంచి పీఠాధిపతి స్నానం చేస్తున్నందునే తానుకూడా పుష్కరఘాట్‌లో స్నానం చేశానని చెప్పారు.
రేపు సీఎమ్కూ, స్పీకర్‌కూ జగన్ ఏమి ట్యూషన్ చెబుతారన్నది ఇప్పుడు పెద్ద ఆసక్తికర అంశంగా మారింది. జగన్ ఇలా ‘ట్యూషన్’ అనే పదాన్ని ఉపయోగించటం ఇదే మొదటిసారికాదు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాలలోకూడా జగన్ ఏదో చెబుతుంటే, టీడీపీ సభ్యులు అభ్యంతరం చెబుతూ, మీనుంచి నేర్చుకోనవసరంలేదని వ్యాఖ్యానించగా, ట్యూషన్ చెబుతున్నానయ్యా, నేర్చుకోండి అని జగన్ అన్నారు. అంటే అసెంబ్లీ సమావేశాలపై, విధి విధానాలపై, కార్యకలాపాలపై మంచి పట్టు సాధించానని, ట్యూషన్ చెప్పే స్థాయికి వెళ్ళానని జగన్ ఉద్దేశ్యం అయిఉండొచ్చు. ఏది ఏమైనా రేపు సీఎమ్కూ, స్పీకర్‌కూ జగన్ సినిమా చూపించేటట్లే ఉన్నారు.