మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్ కార్పెట్ పరుస్తారన్న అంచనాతో.. తెలుగుదేశం పార్టీని చేజేతులా దూరం చేసుకున్న ఆయనకు.. వైసీపీ అధినేత కోలుకోలేని షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆనం రామనారాయణరెడ్డి కూడా ఈ విషయాన్ని పరోక్షంగా తన అనుచరులకు వెల్లడించారు. వైసీపీలో తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో చెప్పలేదు సరి కదా.. అసలు టిక్కెట్లు ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదని.. అసలు సీరియస్గా అహ్వానించడం లేదని.. ఆనం రామనారాయణరెడ్డి తన ముఖ్య అనుచరులకు చెప్పుకొచ్చారు. నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాం…ఏ పార్టీ మంచి అవకాశాలిస్తే ఆ పార్టీలో చేరుదామని తనను కలిసిన అనుచరులకు చెబుతున్నారు. ఆగస్టు నెలలో నిర్ణయం తీసుకుందామని అనుచరులను సముదాయిస్తున్నారు.
పార్టీకి అవసరం అయితే.. అప్పటికప్పుడు సీటు ఖారారు చేసి.. పార్టీలోకి నేతల్ని తీసుకుంటున్న జగన్.. ఆనం విషయంలో మాత్రం ముందు పార్టీలో చేరండి.. తర్వాత టిక్కెట్లు సంగతి చూద్దాం అని చెప్పారు. అలా చెప్పడమే కాదు.. ఆనం కుటుంబీకులు కోరుకుంటున్న నియోజకవర్గాల్లో.. మేకపాటి వర్గీయులతో.. వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించేలా ప్రొత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనం నియోజకవర్గం ఆత్మకూరు. ఇప్పుడు అక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తను సీటు ఖాళీ చేసే ప్రశ్నే లేదని గౌతం రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. పక్కనే ఉన్న ఉదయగిరిలో మేకపాటి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన నేరుగా ఆనంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉదయగిరిలో పోటీ చేసి తీరుతానన్నారు. దీనికి తోడు.. ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా… తీవ్రమైన ఆరోపణలతో… పాంప్లెట్లు పంచి పెడుతున్నారు మేకపాటి వర్గీయులు.
నిజానికి తెలుగుదేశం పార్టీలో తనకు ఎలాంటి అన్యాయం జరగలేదని… ప్రాధాన్యం ఇవ్వని కారణంగానే పార్టీ మారుతున్నానని ఆనం … అందరికీ చెబుతూ వస్తున్నారు. అయితే వైసీపీలో ఆయన చేరకుండానే… పొగపెట్టే ప్రయత్నాలు జరుగుతూండటంతో.. ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో చేరాలన్నది ఆగస్టులో నిర్ణయించుకుందామని చెబుతున్నారు. వైసీపీలో రెడ్ కార్పెట్ ఉంటుందన్న ఆశతో.. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేసిన బుజ్జగింపుల్ని కూడా.. ఆనం లైట్ తీసుకున్నారు. దాంతో ఇప్పుడు.. ఆయనకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది.