వైకాపా ఎమ్మెల్యే రోజా మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడినందుకు ఆమెను సభ నుండి ఏడాదిపాటు సస్పెండ్ చేసారు. కానీ ఆమె మాట్లాడిన దానిలో తప్పేమి లేదని జగన్మోహన్ రెడ్డి ఆమెను వెనకేసుకు వచ్చేరు. అంతే కాదు, తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి ‘కామ చంద్రబాబు’ అన్నామని జగన్ స్వయంగా చెప్పుకొన్నారు. రోజా మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేకపోయినా ఆమెను చాలా అన్యాయంగా ఏడాదిపాటు సభ నుండి సస్పెండ్ చేసినందుకు న్యాయపోరాటం చేయాలనుకొంటున్నట్లు జగన్ చెప్పారు.
ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి ఆమె అటువంటి మాటలు మాట్లాడారని జగనే స్వయంగా అంగీకరిస్తున్నారు. కానీ అందులో తప్పేమి లేదని వాదిస్తున్నారు. మరి తమ మాటలలో ఎటువంటి తప్పు లేదని వారు దృడంగా నమ్ముతున్నప్పుడు, రోజా మాట్లాడిన మాటలు మీడియాలో కనబడినప్పుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో తెలియదు. ఆ వీడియోని మీడియాకి ఎలాగ లీక్ అయిందని వైకాపా సభ్యులు ఈరోజు ఉదయం అసెంబ్లీ సెక్రెటరీ మీద ఎందుకు వీరంగం ఆడారో వారికే తెలియాలి. ఏ తప్పు చేయక పోయుంటే వారే సెక్రెటరీని అడిగి ఆ వీడియోని మీడియాకు విడుదల చేసి ఉండవచ్చు కదా? రోజా చాలా అనుచితంగా మాట్లాడిందని వైకాపా కూడా నమ్ముతోంది కనుకనే ఆ వీడియో మీడియాకి లీక్ కాగానే కంగారుపడినట్లు అర్ధమవుతోంది. ఇదంతా చూస్తుంటే గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకొన్నట్లుంది.