నంద్యాల ఉప ఎన్నికలో పోటీ హౌరాహౌరీగా వుండబోతుందని అందరూ ఒప్పుకుంటున్నారు. అందుకే ఏ ఒక్కరో అవలీలగా గెలిచిపోతారని అనుకోవడం లేదు. ప్రధాన ప్రత్యర్థులైన వైసీపీ టీడీపిలు సరే మేమే గెలిచేస్తామని పైకి అంటున్నా సకల శక్తులా పోరాడవలసిందేనని గుర్తించాయి తప్ప అలవోకగా జరిగిపోతుందని భావించడం లేదు. వైసీపీ అద్యక్షుడు జగన్ అన్నట్టు 2019 కురుక్షేత్రానికి నంద్యాల నాంది పలుకుతుంది. అయితే పెద్దగా జరిగిన బహిరంగ సభలో తన మాటల ద్వారా జగన్ పలికిన నాందీ ప్రస్తావన సరిగానే చేశారా? ఇలాటి సభలో ప్రతిపక్ష నేత విసిరిన సవాళ్లపై సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి వుండాలి. కాని ఒక్క ఫిరాయింపుల నైతికత విషయంలో నిజంగానే టిడిపి ఇరకాటంలో వుంది. వుంటుంది కూడా. ఇతర సమస్యలూ జగన్ మాట్లాడారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నడివీధిలో నిలబెట్టి కాల్చివేయాలనడం ద్వారా తనే ఎదురుదాడికి అవకాశమిచ్చారు. ఇప్పుడు పాలక పక్షం ప్రతినిధులందరూ మిగిలిన విషయాలు వదిలేసి దానిపై దాడి కేంద్రీకరిస్తున్నారు.పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నిస్సందేహంగా రాబోయే రోజుల్లో దీనిపైనే రచ్చ సాగుతుంటుంది. నాయకుడి మాటలు తప్పనలేక సూటిగా సమర్థించలేక వైసీపీ నేతలు అటూ ఇటూ తిప్పి మాట్లా డే క్రమంలో మరిన్ని పొరబాట్టు దొర్లవచ్చు. ఇలాటి భాషలో మాట్లాడితేనే తన అనుయాయులకు ఉత్సాహం వస్తుందని జగన్ భావించివుండొచ్చు గాని ఇతరుల స్పందన కూడా పరిగణించాలి కదా. ఏదో నోరు జారిందనుకుని ఇకనైనా లేనిపోని భీకర వాక్కులుదొర్లకుండా జాగ్రత్త పడటం ప్రచారానికి శ్రేయస్కరం. ఉభయ పక్షాల్లో ఎవరు వికృతంగా మాట్లాడినా ప్రజలు ఆమోదించరు. అసహ్యించుంటారు.