పులివెందులలో దాడులు ఎప్పుడూ జరగలేదని అలాంటి సంప్రదాయం లేదని .. కానీ టీడీపీ తీసుకు వచ్చిందని జగన్ ఆరోపించారు. క్రికెట్ ఆటలో జరిగిన గొడవలో అజయ్ రెడ్డి అనే యువకుడు గాయపడ్డాడు. అది రాజకీయ గొడవగా మార్చేసిన జగన్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి మరీ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
పాతికేళ్ల యువకుడు అజయ్ పై టీడీపీ నేతలు నిర్ధాక్షణ్యంగా దాడికి దిగారని.. రాష్ట్రవ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడానికే ఈ తరహా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబూ మీరు వేసే ఈ చెడు సాంప్రదాయ బీజం రేపు పొద్దున్న మరల మీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబూ ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరన్న విషయాన్ని గుర్తుపెట్టుకొండని కూడా చెప్పారు.
ఈ మాటలేవో జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనకు తానుగా అనుకుని ఉంటే జరుగుతాయని భయపడుతున్న ఎన్నో ఘటనలకు అసలు అవకాశమే ఉండేది కాదు. అధికారంలో ఉన్న రోజున రేపన్నదే లేదన్నట్లుగా చెలరేగిపోయారు. ఇప్పుడు ఎక్కడెక్కడో జరుగుతున్న చిన్న గొడవలకి రాజకీయ రంగు పూసి దాడులు అయిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అసలు తాము ఇంకా రెడ్ బుక్ తెరవలేదని.. అసలు కథ ప్రారంభిస్తే ఇంకెలా ఉంటుందోనని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
పులివెందులలో దాడులే ఉండవని ఆయన చెప్పడం … కూడా ఆశ్చర్యకరమే. అసలు దాడులు లేనిదెప్పుడో ఆయన చెప్పి ఉండాల్సింది. అయితే అప్పట్లో ఏకపక్ష దాడులు జరిగేవి. ఇప్పుడు ఎదురు తిరిగి కొట్టే వాళ్లు కూడా తయారయ్యారు. అదే మార్పు గురించి బహుశఆ జగన్ చెప్పి ఉండవచ్చు.