ఏపీ ప్రభుత్వం వణికిపోతోంది. చంద్రబాబును అరెస్ట్ చేసి రెండు వారాలు దాటిపోయింది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఎవరైనా చిన్న ర్యాలీ తీస్తున్నారంటే వందల మంది పోలీసుల్ని పంపిస్తున్నారు. గుడికి వెళ్లి పూజలు చేస్తామంటే అడ్డుకుంటున్నారు. ఎవరైనా రాజమండ్రి వెళ్లాలనుకున్నా అడ్డుకుంటున్నారు. రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబం ఉంది. ఐటీ ఉద్యోగులు సంఘిభావం చెప్పేందుకు వెళ్లాలనుకున్నారు. కానీ బోర్డర్ లో రోడ్లన్నీ ఆపేసి… వందల మంది పోలీసుల్ని దింపడం జగన్ రెడ్డి భయానికి ప్రత్యక్ష సాక్ష్యంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టుపై సామాన్యుల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చడానికి వారు రోడ్ల మీదకు వస్తే శ్రీలంక తరహా పరిస్థితులు వస్తాయన్న ఆందోళన కారణంగానే వీలైనంత వరకూ… అణిచివేతకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలాంటి ఆంక్షలు లేని చోట ప్రజలు ఎలా నిరసన గళం వినిపిస్తున్నారో అంతటా కనిపసిస్తోంది. తెలంగాణలో చిన్న చిన్న ఊళ్లలోనూ నిరసనలు జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. ఏపీలో అంత ఒత్తిడి ఉన్నా.. నిర్బంధాలు ఉన్నా.. ప్రజలు తరచూ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి నిలువరిచే ప్రయత్నం చేయడం పిచ్చితనంగా మారుతోంది. చంద్రబాబుకు మద్దతుగా శాండ్ ఆర్ట్ చేసినందుకు హత్యాయత్నం కేసు పెట్టడం చూసి జనం నవ్వుకుంటున్నారు.
రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి ప్రజల్ని భయపెట్టి… తొక్కేసి ఉంచుకుందామనుకంటే.. అంత కంటే.. పిచ్చి తనం ఉండదు. మనది ప్రజాస్వామ్యం. ప్రజల్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. ప్రత్యర్థిని ఎంతగా నిర్బంధించి ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో అంతకు మించిన సానుభూతి వస్తుంది. మద్దతుగా ఉంటారు. చరిత్ర చెప్పిన రాజకీయం ఇదే. చంద్రబాబును అరెస్ట్ చేసి భయంతో వణికిపోతే … అది ఓటమికి భయపడుతున్నట్లే అవుతుంది. ఏపీలో ఇప్పుడు అదే కనిపిస్తోంది.