అధికారంలో ఉన్న వారు పనులు చేసి చూపించాలి. ప్రజలు కూడా అదే ఆశిస్తారు. పనులు చేయకుండా చేయలేకపోయామని ఫలానా వారు అడ్డుకున్నారని కారణాలు చెబితే ప్రజలు వినరు. ఎందుకంటే వారికి అధికారం ఇచ్చి పనులు చేయడానికే కానీ కారణాలు చెప్పడానికి కాదు. అయినా ఏ దారి లేక.. ఏ పనులు చేయలేని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కారణాలు ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు డిసైడయింది. తాము ఏం చేయలేకపోయామో.. అవన్నీ చేయలేకపోవడానికి కారణం మీడియా.. చంద్రబాబు అంటూ సీఎం జగన్ ఆవేదనతో చెప్పుకోవడం ప్రారంభించారు.
ప్రభుత్వం ఏ ఒక్క పనిని సక్రమంగా చేయలేదు. అన్నీ న్యాయవివాదాల్లో పడ్డాయి. సక్రమంగా చేయడానికి అవసరమైన పనులు కూడా చేయలేదు. జిల్లాల విభజన ఎలా చేసిందో కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ జిల్లాలను ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. ప్రజలతో నేరుగా సబంధం ఉండి.. ఖర్చులు పెట్టుకోవాల్సిన పథకాలను మాత్రం పెండింగ్‌లో పెట్టి కారణాలు చెబుతున్నారు. దానికో స్కీమ్ అమలు చేస్తూ ప్రచారం చేయబోతున్నారు. బహిరంగసభల్లో అదే చెబుతున్నారు.
ఏ ప్రభుత్వమైనా ఫలితాలు చూపించి ప్రజలను ఓట్లు అడుగుతుంది.కానీ ఈ ప్రభుత్వం మాత్రం పనులుచేయలేకపోయాము విపక్షాలు.. మీడియా అడ్డుకున్నాయని చెప్పి ఓట్లు అడగాడనికి రెడీ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇదో కొత్త వ్యూహం అనుకోవాలి. తిమ్మిని బమ్మిని చేయడంలో వైసీపీ రాటుదేలిపోయింది. గత ప్రభుత్వంపై ఎన్నెన్ని పిటిషన్లు వేసి ఎన్ని పనులకు అడ్డం పడినా గత ప్రభుత్వం చేయగలిగినంత చేసింది కానీ అడ్డుకున్నారని చేతకానితనం చూపించలేదు. కానీ ఇప్పుడు దాన్నే ప్లస్ పాయింట్‌గా ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవడం.. రాజకీయాల్లో కొత్త కోణం.