ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కోసం వచ్చినప్పుడు ఆయనని కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరబోతున్నట్లు సాక్షి మీడియాలో వార్తలు వచ్చేయి. అదే నిజమయితే ఒక చారిత్రక కార్యక్రమం జరుగుతున్న వేళలో కూడా జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఆలోచించకుండా తన ప్రాధాన్యతని, ప్రత్యేక హోదా తను చేస్తున్న పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్ళాలనుకొంటున్నట్లు అర్ధం అవుతుంది. బహుశః అందుకే ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడలో అడుగు పెట్టే ముందు రోజు వరకు కూడా వైకాపా రకరకాల నిరసన దీక్షలు చేపట్టాలని నిశ్చయించుకొన్నట్లు అనుమానించవలసి వస్తోంది.
జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రత్యేక హోదా సాధించాలనే కోరిక ఉందో లేదో తెలియదు కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం ప్రజలలో అపనమ్మకం కలిగేందుకే దోహదపడుతోంది. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేసినందునే జగన్మోహన్ రెడ్డికి ఈ ఉద్యమాలు చేసే అవకాశం కలిగింది. తను చేస్తున్న ఈ ఉద్యమాల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ దాని కోసమే జగన్ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఆశించడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కలవాలనుకొంటే ఆయన ఆంధ్రాకి వచ్చేలోగా లేదా తిరిగి ఆయన డిల్లీ చేరుకొన్నాక ఎప్పుడయినా వెళ్లి ఆయనను కలిసి మాట్లాడవచ్చును. కానీ సమయం సందర్భం లేకుండా రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరిస్తున్నపుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని అపాయింట్ మెంట్ అడిగి ఇవ్వకుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని వాదిస్తూ అందుకు నిరసనగా మళ్ళీ దీక్షలు ధర్నాలు చేయాలనుకొంటున్నారేమో?
జగన్ తను ప్రత్యేక హోదా కోసం అకుంటిత దీక్షతో పోరాడుతున్నట్లు చాటుకొనేందుకే ఇవన్నీ చేస్తుండవచ్చును. కానీ ఆయన చర్యలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. ఆయనకి రాజధాని నిర్మాణం జరగడం ఇష్టం లేదు అందుకే దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారనే అభిప్రాయం ప్రజలకి కలిగేలా చేస్తున్నారు. కనుక జగన్ కొంచెం ఆలోచించి అడుగులు ముందుకు వేస్తే మంచిది.