వైకాపాకు కంచుకోట వంటి కడప జిల్లాలోనే దానిని దెబ్బ తీయాలని తెదేపా పావులు కదపడం మొదలుపెట్టడంతో జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయినట్లున్నారు. ఆయన డిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా కడపకు చేరుకొని తన పార్టీ నేతలు, కార్పోరేటర్లతో సమావేశమయ్యి పార్టీ పరిస్థితి గురించి చర్చించారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి.
‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా పార్టీ ఎమ్మెల్యేలను తెదేపాలోకి రప్పించడానికి ఒక్కొక్కరికీ రూ.30 కోట్లు వరకు చెల్లించడానికి సిద్దపడుతున్నారు.అదికాక క్యాబినెట్ లో మంత్రి పదవులు, కాంట్రాక్టులు, మైనింగ్ లైసెన్సులు వగైరా తాయిలాలు ఇవ్వజూపుతున్నారు. అయినా మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకి లొంగడం లేదు,” అని ఆరోపించారు.
సాధారణంగా ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటుకి ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, ఎంపిలను జగన్ చెపుతున్నట్లు అంత భారీ సొమ్ము ముట్టజెప్పి వారి మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తుంటాయని అందరికీ తెలుసు. కానీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెదేపా, మనుగడ ప్రశ్నార్ధకంగా సాగుతున్న వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించేందుకు అంత డబ్బు ఎందుకు చెల్లించుతుంది?అని ఆలోచిస్తే జగన్ ఆరోపణలో బలం లేదని అర్ధమవుతుంది.
“పార్టీలో నుండి వెళ్ళిపోయిన ఆ నలుగురు తప్ప మిగిలిన 63 మంది ఎమ్మెల్యేలు నా వెంటే ఉన్నారు. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగనందుకు వారికి హ్యాట్స్ ఆఫ్’” అని మొన్న చెప్పిన జగన్ నిన్న మళ్ళీ ఈ రూ.30 కోట్ల ఆరోపణ చేయడం గమనిస్తే, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవచ్చునని తనకి అనుమానం ఉన్నట్లు చెప్పుకొన్నట్లుంది.
జగన్ ఆరోపిస్తున్నట్లు తెదేపాలో చేరే వైకాపా ఎమ్మెల్యేలు అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. జగన్ చేసిన ఆరోపణలలో పార్టీ మారదలచుకొన్న వైకాపా ఎమ్మెల్యేలకి మైనింగ్ లైసెన్సులు, కాంట్రాక్టులు ఇస్తామని చంద్రబాబు ప్రలోభపెడుతున్నారన్నారు. అధికార పార్టీలోనే నేతలు వాటికోసం పోటీలు పడుతుంటే, అవసరం లేకపోయినా వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించుకొని వారికి అవి కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? అని ఆలోచిస్తే ఆయన ఆరోపణలు ఎంత అర్ధరహితమో అర్ధమవుతాయి. పైగా స్వంత పార్టీ వారిని కాదని కొత్తగా వచ్చిన వైకాపా ఎమ్మెల్యేలకి అవి కట్టబెడితే అప్పుడు తెదేపాలో కూడా ముసలం పుట్టే ప్రమాదం ఉంటుంది కదా!
భూమానాగి రెడ్డి వంటి కొందరు ముఖ్యమయిన వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలో ఆకర్షించడానికి అటువంటి ఆఫర్లు ఇస్తే ఇచ్చి ఉండవచ్చు గాక కానీ తెదేపాలో చేర్చుకోవాలనుకొనే వారందరికీ అటువంటి ఆఫర్లు ఇవ్వడం సాధ్యం కాదని రాజకీయ పరిజ్ఞానం లేని వారు కూడా చెప్పగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ ఎమ్మెల్యేలకి తెదేపా ఆ బంపర్ ఆఫర్లతో ప్రలోభ పెడుతోందని ఆరోపిస్తున్నారు. తెదేపా నిజంగా అటువంటి ఆఫర్లు ఇవ్వలేకపోయినా జగన్ చెపుతున్న ఈ మాటలు పార్టీ మారే ఉద్దేశ్యం లేని వైకాపా ఎమ్మెల్యేలకు కూడా అటువంటి ఆలోచన కలుగజేసివిగా ఉన్నాయి. అంటే వైకాపాకి తెదేపా చేస్తున్న డేమేజ్ కంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ డేమేజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనినే సెల్ఫ్ గోల్ చేసుకోవడం లేదా శల్య సారద్యం అనవచ్చును.