నీతినిజాయితీకి మారుపేరని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం చాలా తప్పని చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు అవినీతితో సంపాదించిన డబ్బుని వెదజల్లి, తమ ఎమ్మెల్యేలని కొనుకొని తీసుకువెళ్లిపోతున్నారని జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా నేతలు అందరూ చేస్తున్న ఆరోపణలను ఇంతవరకు తెదేపా నేతలెవరూ గట్టిగా ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజమని వారు ఒప్పుకొంటున్నట్లుంది. కానట్లయితే వారిని ఆరోపణలు రుజువు చేయమని లేకుంటే పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తామని గట్టిగా హెచ్చరించవచ్చును. కానీ ఆవిధంగా మాట్లాడకుండా, జగన్ తీరు నచ్చకనే వైకాపా ఎమ్మెల్యేలు వచ్చి తమ పార్టీలో చేరుతున్నారని చెప్పుకొంటున్నారు. రాజధానిలో తెదేపా నేతలు బినామీ పేర్లతో వేల ఎకరాలను కొనుకొన్నారని వైకాపా ఆరోపణలు చేసినప్పుడు కూడా తెదేపా నేతలు గట్టిగా స్పందించలేదు. మంత్రి నారాయణ కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కానీ దావా వేయలేదు. అంటే కోర్టుకి వెళ్లేందుకు వారు వెనుకాడుతున్నారని అర్ధమవుతోంది. కనుక వైకాపా చేస్తున్న ఆరోపణలలో ఎంతో కొంత వాస్తవం ఉందని నమ్మవలసి ఉంటుంది. కానీ వైకాపా దృష్టిని తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఈ విషయం మీద నుంచి వేరే అంశం మీదకి మళ్ళించడంలో తెదేపా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించినట్లు అర్ధమవుతోంది. రాజధాని బినామీ భూముల వ్యవహారాన్ని బయటపెట్టి తెదేపా నేతలని ప్రజల ముందు దోషిగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత అవిశ్వాస తీర్మానాలు చేస్తూ, విప్ జారీ చేయడం ద్వారా తెదేపాలో చేరిన తమ పార్టీ సభ్యులపై అనర్హత వేటు పడేలాచేయడానికి, రోజా సస్పెన్షన్ కేసుపై అనవసరమయిన హడావుడి చేస్తూ, బినామీ భూముల వ్యవహారం ఊసు ఎత్తడం మరిచిపోయారు. ఈవిధంగా ఒక అంశంపై పోరాటం కోసం మరొకదానిని పణంగా పెడుతూ చివరికి అన్ని వ్యవహారాలలోను ఆయన తెదేపా చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మరి ఆ సంగతి ఆయనకు అర్ధమయిందో లేదో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు వ్యూహాలను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ నెగ్గలేరేమో?అని అనుమానం కలుగుతోంది. అందుకు ప్రధాన కారణం ఆయన పార్టీలో సీనియర్ నేతలతో చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకోకపోవడమే కావచ్చును.