దుష్టచతుష్టయం నుంచి తనను రక్షించాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నానంటూ సీఎం జగన్ తిరుపతిలో వ్యాఖ్యానించారు. విద్యా దీవెన నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసేంందుకు బటన్ నొక్కేందుకు బహిరంగసభను తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఈ బటన్ నొక్కిన తర్వాత విపక్షాలపై విరుచుకుపడ్డారు. అన్ని నేరాలు.. ఘోరాలు టీడీపీ నేతలే చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వం చేసే పనుల గురించి కొద్ది సేపు చెప్పుకున్న జగన్ ఆ తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబులపై విమర్శలు ప్రారంభించారు. వీరంతా దొంగల ముఠా అని మంచి చేస్తే వీళ్ళకంత కడుపుమంట అని చెప్పుకొచ్చారు.
ప్రశ్నాపత్రాల లీక్ కూడా టీడీపీ నేతలే చేశారని జగన్ ఆరోపించారు. విద్యా దీవెన పధకం ఇస్తున్న నేపథ్యంలో ప్రశ్న పాత్రలను లీక్ చేసి, ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. నారాయణ చైతన్య కాలేజీలు లీక్ చేసి దొంగే దొంగ దొంగ అంటూ ప్రభుత్వంపై కుతంత్రాలు చేస్తున్నారన్నారు. ప్రధాన నగరాల్లో ఏదేదో జరిగిపోతోందని నానాయాగిరి చేస్తున్నారు.. చేసిన వాళ్ళు ఎవరో ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 చెప్పదు.. ఎందుకంటే వాళ్లంతా టీడీపీ నాయకులేనని జగన్ చెప్పుకొచ్చారు.
తండ్రి ఒక్క అడుగు వేస్తే తనయుడు జగన్ నాలుగు అడుగులు వేస్తున్నాడని జగన్ తన గురించి చెప్పుకున్నారు. పూర్తి స్థాయి ఫీజు ఋఇన్వెస్ట్మెంట్ ప్రతి త్రైమాసికంలో విద్యార్థి తల్లి ఖాతాలో వేస్తున్నామని. ప్రతి కుటుంబం నుంచి ఓ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ స్థాయికి వచ్చేలా పెట్టుబడి ప్రభుత్వం పెడుతోందన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లను మూసేశారని.. పిల్లల తల్లితండ్రులు ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్చి వారి బాధ వారు పాడుకుంటారానే ఆలోచన చేశారన్నారు.