ముఖ్యమంత్రి హోదాలో తానిచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని సీఎం జగన్ అసంతృప్తికి గురయ్యారు. అధికారులపై సీరియస్ అయ్యారు. సీఎం హామీలు, ఆదేశాలను త్వరగా అమల్లో పెట్టేలా.. బిజినెస్ రూల్స్ సవరణ చేస్తూ నేరుగా జీవో జారీ చేసేశారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఐదు నెలల కాలంలో… అనేక హామీలను జగన్ ఇచ్చారు. అందులో… ప్రభుత్వ స్కూళ్లులో పారిశుద్ధ్య పని చేసే వారికి జీతాల పెంపు దగ్గర్నుంచి కొన్ని వందల ఆదేశాలుంటాయి. కానీ.. జగన్ ఆదేశించిన వాటిలో కనీసం పది శాతం కూడా ఇంత వరకూ అమల్లోకి రాలేదు. చివరికి ప్రభుత్వ స్కూళ్లలో పని చేసే పారిశుధ్ధ్య కార్మికులకు కూడా జీతాలు పెంచలేదు. జగన్ ఆదేశించినా పనులు కావడం లేదు.. ఇదేం ప్రభుత్వం అనే విమర్శలు… పెద్దల వరకూ రావడంతో… మరింత డ్యామేజ్ కాకుండా రంగంలోకి దిగారు.
సీఎం హామీల అమలును మూడు కేటగిరీలుగా విభజించారు. అవుట్ టు డే, మోస్ట్ ఇమ్మీడియెట్, ఇమ్మీడియెట్ కేటగిరీలుగా విభజిస్తూ జీవో జారీ చేశారు. అవుట్ టుడే కేటగిరిలో నిర్ణయం తీసుకున్న రోజే జీవో జారీ చేయాలి.. మోస్ట్ ఇమ్మీడియెట్ కేటగిరిలో నిర్ణయం తీసుకున్న 5 రోజుల్లో జీవో జారీ చేయాలి. ఇమ్మీడియెట్ కేటగిరిలో నిర్ణయం తీసుకున్న 15 రోజుల్లో జీవో జారీ చేయాలని.. జీవోలో మార్గదర్శకాలను వెలువరించారు. ఆర్ధిక, న్యాయశాఖ క్లియరెన్స్ తీసుకునేందుకు రెండు రోజులు … మిగతా శాఖలు ఒక రోజులో క్లియర్ చేయాలని ఆదేశించారు. ఒక అలా చేయకపోతే.. ఆటోమేటిక్ గా క్లియర్ అయినట్లుగా గుర్తించాలన్నరారు. నిర్ణీత సమయంలో జీవోలు ఇవ్వకపోతే కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మీడియా దృష్టిని ఆకర్షించే అంశాలు ఉన్న జీవోలు సీఎంకు తెలియకుండా ఇవ్వరాదని మంత్రులు, అధికారులను ఆదేశించారు. వీటిపైనా సీఎంవోకు పంపిన ముసాయిదా ఉత్తర్వులపై ఐదురోజుల్లోగా స్పందన రాకపోతే ఆమోదంగా గుర్తించి జీవో విడుదల చేసుకోవచ్చన్నారు.
అయితే..సీఎం ఆదేశాలపై అధికారులు.. నిర్లక్ష్యంతో ఉండటం లేదని.. దాదాపుగా అన్నీ ఆర్థిక అనుమతులు పొందాల్సినవేనని అంటున్నారు. ఉన్న పళంగా జీవో జారీ చేస్తే.. నిధులు ఎలా సర్దుబాటు చేస్తారని… అర్థిక శాఖ ఎక్కువగా పెండింగ్ లో పెడుతోందంటున్నారు. అయితే.. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా జరగడం లేదంటే.. అది ప్రభుత్వాధినేతకు అవమానమే. ఇలాంటివి పెరిగిపోతే ముఖ్యమంత్రి ఆదేశాలకు విలువ ఉండదు. అందుకే..ఇలాంటివి లేకుండా.. తక్షణం… సీఎం ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆదేశాలొచ్చాయి. మరి ఇప్పటికైనా జగన్ మాటను వేదవాక్కుగా భావిస్తారో లేదో..?