అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ కేపిటిల్ను.. మూడు నెలల్లోనే విశాఖకు మార్చాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ ఉంది. ఈ ఆలోచన సీఎం కాక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డికి ఉంది. తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు, ఐదుగురితో మాత్రమే.. ఈ ఆలోచనపై చర్చించి.. మూడు నెలల కిందటే కార్యాచరణ కూడా ప్రారంభించారని.. ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే విశాఖపట్నంలో దాదాపుగా రెండు వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వం నియమించిన రెండు కమిటీల నివేదికలు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వారం రోజుల్లో వచ్చిన వెంటనే మూడు నుంచి నాలుగు నెలల్లోనే కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసిందని తెలుస్తోంది.
మూడు నెలల ముందు నుంచే విశాఖలో రాజధాని ఏర్పాట్లు..!?
ప్రభుత్వ కార్యాలయాల కోసం విశాఖపట్నంలోని కొన్ని ప్రభుత్వ స్థలాలు, భవనాలను కూడా గుర్తించారని అంటున్నారు. విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పక్కనే ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ స్థలం, విశాఖలో జీవీఎంసీ అద్దెకిచ్చిన గోల్ఫ్ కోర్టు దానిపక్కనే ఉన్న 200 ఎకరాల స్థలంతోపాటు సింహాచలం దేవస్థానం భూములను కూడా అవసరమైతే వినియోగించుకోవచ్చునని భావిస్తున్నారు. శాఖాధిపతుల కార్యాలయాలు ఇప్పటికే అమరావతిలోను, విజయవాడ, గుంటూరు నగరాల్లో అద్దె భవనాల్లోనే ఉన్నాయని, విశాఖపట్నం, సరిహద్దు ప్రాంతాల్లో అనేక అపార్ట్ మెంట్లు, ఇతర భవనాల్లోకి వీటిని మార్చవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను కూడా అనధికారికంగా చేయాలని కొంతమంది అధికారులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఖాళీ చేసిన అరలక్ష చదరపు అడుగులు ఉన్న ఓ భవనం ప్రధానంగా వినియోగించుకోవడానికి.. ఆ భవన యజమానితో చర్చలు జరుపుతున్నారు.
మరో మూడు..నాలుగు నెలల్లో విశాఖకు మొత్తం తరలింపు..!
ఏయూలో కొన్ని భవనాలను కూడా.. వాడుకోవచ్చని భావిస్తున్నారు. భీమిలీలో మూడు ఎకరాల స్థలంలో ఉన్న ఓ ఇంటిని సీఎం నివాసంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. పరదేశీపురంలో ఎక్కువ కార్యాలయాలు… పెట్టే అవకాశం ఉందంటున్నారు. సర్క్యూట్ హౌస్‌ను రాజ్‌భవన్‌గా మారుస్తారని చెబుతున్నారు. మూడు నాలుగు నెలల్లోఈ తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండే నగరంగా పేరుండటం… సాగరతీరంలో ఉండటం, వాతావరణం కూడా బాగా ఉంటుందని, పైగా అభివృద్ధికి ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు విశ్లేషిస్తున్నారు. అందువల్లే మూడు,నాలుగు నెలల లోపు కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి విశాఖ నగరానికి మార్చేందుకు పావులు కదుపుతున్నారు. అంతర్గతంగా జరుగుతున్న ఈ ప్రయత్నాలు వైసీపీలోను, ప్రభుత్వ యంత్రాంగంలోని కొంతమంది కీలక వ్యక్తులకు మాత్రమే తెలుసంటున్నారు.
గతంలో విశాఖ రాజధానిగా పనికి రాదన్న జగన్..!
విశాఖ పూర్తిగా కాలుష్య కారకమైన నగరం. తుపానుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడ రాజధాని నిర్మించలేం… ఇదీ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అయితే ఇప్పుడు చేసింది కాదు. పదవిలోకి రాక ముందు. పదవిలోకి రాక ముందు అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. అలాగే గతంలో విశాఖ రాజధానిగా పనికి రాదని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్లో సర్క్యూలేట్ అవుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో దీనిపై వచ్చిన న్యూస్ ఆర్టికల్‌ను.. కూడా.. వైసీపీ పెద్దలు తొలగించారు. కానీ లింక్ మాత్రం.. కనిపిస్తూనే ఉంది.