సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ అనుకుంటే ఆయన తర్వాత వచ్చిన ఐజీ సంజయ్ మరింత దూకుడుగా ప్రభుత్వపెద్ద మెప్పు కోసం పని చేశారు. మార్గదర్శి విషయంలో ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. దర్యాప్తు చేస్తున్నారా.. లేకపోతే మీడియా ట్రయల్ నిర్వహించి.. శిక్షలు విధిస్తున్నారా అని హైకోర్టు కూడా ప్రశ్నించాల్సి వచ్చింది. అయితే ఆయన చేసిందేదీ కూడా ఆయన సొంతం కాదు. అంతా పక్క గదిలో నుండి వచ్చే స్లిప్పుల ప్రకారమే అంతా చేశారు. కానీ ఇప్పుడు ఆయనకు కూడా జగన్ షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు.
ప్రస్తుతం సీఐడీ చీఫ్ సంజయ్ సెలవులో వెళ్లిపోయారని.. శ్రీకాంత్ అనే మరో ఐపీఎస్ ఆఫీసర్ కు సీఐడీ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. క్రైస్తవ చింతనలో ఎక్కువగా ఉండే ఐపీఎస్ సంజయ్ గతంలో పెద్దగా కీలక పోస్టుల్లో ఎప్పుడూ లేరు. ఆయన ఎక్కువగా క్రీస్తు పాటలు పాడుతూ … గాయకుడిగా తన ప్రతిభను యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు. ఆయనను సీఐడీ చీఫ్ చేసి… మార్గదర్శిలో లేని అక్రమాల్ని చూపించి ఏదో చేయించాలనుకున్నారు.
ఇంత కాలం వివాద రహితుడిగా ఉన్న ఆయన మార్గదర్శి కేసులో వ్యవహరించిన తీరుతో కొంత మందికి టార్గెట్ అయ్యారు. ప్రభుత్వం మారితే మార్గదర్శిపై ఆయన చేసిన కుట్ర అంతా బయటకు వస్తుంది. ప్రెస్ మీట్లలో ఆయన చెప్పిన విషయాలపై విచారణ జరుగుతుంది. దీనికి ఆయనే బలవుతారు కానీ… స్లిప్పులు పంపిన వారు కాదు. ఇప్పుడు సీఎం కూడా ఆయనను దూరం పెడుతున్నారని చెబుతున్నారు. అంటే ఆ అధికారిని బలి చేసినట్లేనని… ఉన్నత అధికార వర్గాల్లో సానుభూతి వ్యక్తమవుతోంది.