వైసీపీ నేతల మధ్య పంచాయతీలు దాడులకు దారి తీస్తున్నాయి. ముఖ్య నేతల మధ్య తిట్ల పంచాయతీలను తీర్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నా.. కింది స్థాయి నేతలు ఏమాత్రం ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య జరిగిన తిట్ల పురాణం అంశంపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. వారిద్దర్నీ క్యాంప్ ఆఫీసుకు పిలిపించి వివరణ తీసుకున్నారు. అవినీతి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తోసుకునే వరకూ వెళ్లింది. ఓ దశలో దాడి చేసుకుంటారన్న ఆందళన కూడా వ్యక్తమయింది. ఇది ప్రజల్లోకి వెళ్లడంతో జగన్ వారిని పిలిచి వివరణ తీసుకున్నారు.
ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ.. ఇలా డీఆర్సీ సమావేశంలో రచ్చ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పంపించారు. అంతకు ముందు విశాఖ డీఆర్సీ సమావేశంలో విజయసాయి, ఇతర నేతల మధ్య జరిగిన వాగ్వాదం విషయంలోనూ జగన్ ఇలాగే అందర్నీ పిలిచి వివరణ తీసుకున్నారు. ఓ సారి పిలిచి సీరియస్ అయ్యారన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ఇతర నేతలు కూడా.. వెనక్కి తగ్గలేదు. వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. పై స్థాయి నేతలే అలా ఉంటే..ఇక కింది స్థాయి నేతలు ఊరుకుంటారా..? వారి స్థాయిలో వారు వర్గ పోరాటం చేస్తున్నారు.
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఒకే పార్టీలోని వర్గంపై ఆస్పత్రి వెళ్లి మరీ దాడులు చేసేంత స్థాయికి వెళ్లిపోయింది. జగన్ చెప్పే మాటల్ని.. పార్టీ నేతలు సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ కారణంగా క్రమశిక్షణ ఉల్లంఘన ఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ దశలో ఒకరిద్దరిపైనైనా కఠినంగా చర్యలు తీసుకుంటేనే మిగతావారు దారికి వస్తారని.. లేకపోతే.. పార్టీ మొత్తం పాకిపోతాయని.. సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై జగన్ సీరియస్గా దృష్టి సారించాలంటున్నారు.