గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు సీఎం జగన్ . పీఆర్సీ చర్చల సమయంలో కొంతమంది టెస్టులు పాసయ్యారు..మరికొంత మంది పాస్ కాలేదు..అందరికీ కలిపి ఒకే సారి పర్మినెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్ద ఇప్పుడు షాక్ ఇచ్చారు. కేవలం డిపార్టుమెంటల్ పరీక్షల్లో పాసైన వాళ్లకే పర్మినెంట్ చేస్తూ సంతకం చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం.. లక్షా ఇరవై వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో సగానికి సగం మంది … అదే పదిహేను వేల జీతానికి పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా మూడేళ్ల పాటు వారు పర్మినెంట్ అవుతుందని ఎదురు చూస్తూ గడుపుతున్నారు.
నిజానికి వారు పరీక్షలు రాసే ఉద్యోగాల్లోకి వచ్చారు. రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని చెప్పారు కానీ.. మళ్లీ పరీక్షలు పెడతామని.. అందులో ఫెయిలయితే పర్మినెంట్ చేయబోమని చెప్పలేదు. అపాయింట్మెంట్ లెటర్లోనూ అలాంటివిలేవు. కానీ ఇప్పుడు మళ్లీ పరీక్షలు పెట్టి చాలా మందికి ఉద్యోగం పర్మినెంటే చేయడం లేదు. పర్మినెంట్ అయిన తర్వాత ఏమైనా పూర్తి స్థాయిలో జీతం వస్తుందా అంటే.. పీఆర్సీ ప్రకారం జీతం ఖరారు చేశామని చెబుతున్నారు.
ఆ లెక్కన పర్మినెంట్ అయ్యే ఉద్యోగులకు నెలకు చేతికి వచ్చే మొత్తం కేవలం రూ. 23వేలు అని చెబుతున్నారు. అంటే… వారికి పే స్కేల్ విషయంలోనూ అన్యాయమే జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుతీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సీఎం జగన్ ను నమ్మి పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా వదులుకుని ప్రభుత్వ ఉద్యోగాలుఅనుకుని వచ్చి చేరారు. చివరికి వారు తమ కెరీర్లను పోగొట్టుకోవడమే కాదు.. ఇప్పుడు అరకొర జీతాలకు.. పర్మినెంట్ అవుతుందో లేదో అన్న టెన్షన్‌తో గడపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిపై వారు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.