ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కడా లేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు కర్నూలా.. విశాఖనా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణం తెలంగాణ సర్కార్ అని చెప్పుకోవచ్చు. కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏంటీ విశాఖకా..? అని ప్రశ్నిస్తోంది. ఎందుకంటే విశాఖ కృష్ణా బేసిన్లో లేదు. కృష్ణా బేసిన దాటి మూడు వందల కిలోమీటర్ల అవతల ఉంది. ఏవరైనా కృష్ణా బోర్డును కృష్ణా బేసిన్లో ఏర్పాటు చేసుకుంటారు కానీ ఎక్కడో విశాఖలో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తోంది. తమ వాదనను వారు రాత పూర్వకంగా కృష్ణాబోర్డుకు తెలియచేశారు.
బోర్డులో ఇరు రాష్ట్రాల ఉద్యోగులు, అధికారులు ఉంటారని, వీరు విధు లు నిర్వర్తించడం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమని తెలంగాణ వాదిస్తోంది. కర్నూలు, విజయవాడ, శ్రీశైలంలో ఎక్కడకు తరలించినా.. అభ్యంతరం లేదని కానీ విశాఖ మాత్రం వద్దని తెలంగాణ అంటోంది. మరో వైపు కర్నూలులో కృష్ణాబోర్డును ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి కొత్త చిక్కులు ప్రారంభమయ్యేలా ఉన్నాయి. నిజానికి కృష్ణాబోర్డును విజయవాడలో పెట్టాలని గత ప్రభుత్వం.. గత ఏడాది వరకూ ఈ ప్రభుత్వం కూడా కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాసింది.
తర్వాత ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుంది. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో బోర్డు అధికారులు విశాఖలో రెండు ప్రదేశాలను ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు 27న జరగనున్న బోర్డు సమావేశంలో దీన్ని ఎజెండాగా చేర్చారు. అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి ఏర్పడింది. కర్నూలు ప్రజల కోరిక నేరవేర్చకపోతే ఇబ్బందిపడేది ఏపీ ప్రభుత్వమే. ఈ సమస్యను సున్నితంగా డీల్ చేయాల్సి ఉంది.