దివిస్ ఫార్మా కంపెనీ కాలుష్యం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటన చేపట్టి బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఒక కొత్త ట్రెండ్ ప్రారంభించారు జనసేన పార్టీ నేతలు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయా సమస్యలపై మాట్లాడిన పాత వీడియోలను సభలోనే టెలికాస్ట్ చేసి అప్పటి వాగ్దానాలను ఇప్పటి ప్రవర్తనను పోల్చి చూపిస్తూ జగన్ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు జనసేన నేతలు. దీనికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది . వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన చేపట్టిన ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు . అన్నవరం నుండి తొండంగి మండలం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కొత్త పాకాల చేరుకున్నారు జనసేన నేతలు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తున్న సమయంలో ఇదే ఫార్మా కంపెనీ సమస్య విషయంలో గతంలో ఇదే ప్రాంతాన్ని సందర్శించిన వైయస్ జగన్ అప్పట్లో మాట్లాడిన మాటలు అన్ని వీడియో రూపంలో స్టేజ్ పై నే ప్రదర్శించారు జనసేన నాయకులు. గతంలో జగన్ మాట్లాడుతూ , ఈ ఫార్మా కంపెనీని మరెక్కడైనా పెట్టి ఉంటే తాము కూడా ఉద్యోగాలు వస్తున్నాయనే ఉద్దేశంతో స్వాగతించి ఉండేవారమని, కానీ ఇక్కడ హేచరీలు, ఆక్వా పరిశ్రమలు ఉన్న ఈ ప్రాంతంలో అలాంటి ఫార్మా కంపెనీలు పెట్టడం ద్వారా తీవ్ర నష్టం జరుగుతుందని తీవ్రస్థాయిలో అప్పట్లో జగన్ దుమ్మెత్తి పోస్తూ మాట్లాడిన వీడియోలు ప్రదర్శించారు జనసేన నేతలు. అదే విధంగా అప్పట్లో జగన్ మాట్లాడుతూ, 65 లక్షల కిలో లీటర్ల మంచి నీటిని తీసుకొని అందులో నుంచి దాదాపు 55 లక్షల కిలో లీటర్ల మంచినీటి ని దివిస్ ఫార్మా కంపెనీ కలుషితం చేస్తోందని అప్పట్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వీడియో ని స్టేజి పైనే ప్రదర్శించినప్పుడు సభికుల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
ఈ వీడియోలన్నీ చూపించి, ఆ తర్వాత జగన్ ప్రస్తుత వైఖరిని ఎండగడుతూ నాదెండ్ల మనోహర్ ప్రసంగించిన ప్రసంగానికి కూడా అక్కడి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది అదే విధంగా గతంలో జగన్ రెడ్డి ఇలాగైతే ఆ ఫార్మా కంపెనీ గోడలు బద్ధలు చేస్తామని , ఫార్మా కంపెనీ బంగాళాఖాతంలో విసిరేస్తాము అని అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కానీ అధికారం రాగానే ప్రజలను వారి మానాన వారిని వదిలేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు అని నాదెండ్ల మనోహర్ వైఎస్సార్సీపీని దుయ్యపడుతూ మాట్లాడారు.