ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్ను.. పెద్దన్నగా చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం… ఇంకో విధంగా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ వైపు నుంచి తెలంగాణ కొన్ని ప్రయోజనాలు పొందింది. కానీ తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన వాటిపై ఏ మాత్రం స్పందన లేకపోగా.. విభజన సమస్యలన్నింటినీ.. ఏకపక్షంగా.. ఏపీకి నష్టం చేసేలా ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి విద్యుత్ ఉద్యోగుల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొని ఉంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 1157 మంది ఉద్యోగులకు ఆంధ్రా స్థానికత ఉందని వారిని వెంటనే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ వ్యవహారం వివాదంగా మారడంతో ఏపీ విద్యుత్ సంస్థలు వీరిని చేర్చుకునేందుకు తిరస్కరించాయి. దీనిపై న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. ఉద్యోగులు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చారు. 612 మంది ఏపీకొస్తామని, 545 మంది తెలంగాణలో ఉంటామని ఆప్షన్లిచ్చారు
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. అయితే సుప్రీంకోర్ట్ విచారణ కమిటీ సమావేశానికి 48 గంటల ముందు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మొత్తం 1157 మందిని ఏపీకి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్తామని దరఖాస్తు చేసుకున్న 256 మంది ఉద్యోగుల విజ్ఞప్తిని కూడా తిరస్కరిస్తూ వారిని కూడా ఏపీకే కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై ఏపీ విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
తెలంగాణ సర్కార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు అంటున్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. కనీసం స్పందించలేదు. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకసభ్య కమిటీకి కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని .. అయినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండి పడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ సీఎంలు చర్చలు జరుపుతున్న సమయంలో తెలంగాణ ట్రాన్స్ కో అధికారులు ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడం అంటే.. ఏపీని అవమానించడమేనంటున్నారు. కానీ ఈ మాటలు.. ప్రభుత్వానికి పట్టడం లేదు. తెలంగాణ సర్కార్ ఏదీ చేస్తే.. అది సమ్మతమే అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.