కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్ని నెలల క్రితం అనంతపురం పర్యటనకి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అంశంపై వైకాపా గట్టిగా పోరాడలేకపోతోందని విమర్శించేసరికి, జగన్మోహన్ రెడ్డికి ఉక్రోషం పొడుచుకు వచ్చి లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా, వెంటనే ప్రత్యేక రైళ్ళు కట్టించుకొని డిల్లీ వెళ్లి 4-5గంటలు ధర్నా చేసి, రాష్ట్రానికి తిరిగి రాగానే రాష్ట్ర బంద్ నిర్వహించి, ఆ తరువాత ఆరు రోజుల ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని నీరసంగా లేచారు. మళ్ళీ ఆనాటి నుండి ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు…ఎందుకో?
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదా సాధించాలనే ఆసక్తి, తపన రెండూ లేవని ఎద్దేవా చేసేవారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు ఎవరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడటం సంగతి అటుంచి కనీసం ఆ ‘ప్రత్యేక పదం’ ప్రస్తావన రాకుండా చాల జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రంలో నిరుద్యోగం ప్రబలిపోయి రాష్ట్రంలో ఏదో అనర్ధం జరిగిపోతుందని విద్యార్ధులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికి ఎత్తుకొన్నారు తప్ప అది రాకపోతే రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతుందని కాదు. అందుకే ఆయన తన రాజకీయ శత్రువయిన చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని పోరాడారు తప్ప, ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన కేంద్రంపై పోరాడలేదు. నిజం చెప్పాలంటే అది రాదని గ్రహించినందునే అటువంటి అంశంపై ఎంత కాలం అయినా పోరాడవచ్చనే ఆలోచనతో దానిని భుజానికెత్తుకొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జవాబు చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్న చంద్రబాబు నాయుడుని, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో చివరికి తనే నలుగురిలో నవ్వులపాలయ్యారు.
ఆయన పోరాటంలో నిజాయితీ, చిత్తశుద్ధి రెండూ లేవని గ్రహించినందునే రాష్ట్ర ప్రజలు కూడా పెద్దగా స్పందించలేదు. అయినప్పటికీ చేతిలో బలమయిన మీడియా ఒకటి ఉంది గాబట్టి తన పోరాటాలకి యావత్ రాష్ట్ర ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేస్తున్నారని ప్రచారం చేసుకొన్నారు. ఒకవేళ నిజంగానే ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేస్తున్నట్లయితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అప్పుడు ఆయన తన ప్రత్యేక పోరాటాన్ని మరింత ఉదృతంగా చేసి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తన పోరాటాన్ని అర్దాంతరంగా నిలిపివేశారు. అంటే అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారు కానీ వాస్తవంగా ప్రజల మద్దతు పొందలేకపోయారని స్పష్టం అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోడి అమరావతి వచ్చినపుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెళ్లి పోయారు. అప్పుడు అధికార, ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రత్యేక హోదా కోసమే పోరాడుతూ ఉండి ఉంటే అటువంటి అవకాశాన్ని వదులుకొనేవారు కాదు. ప్రజాగ్రహాన్ని తన ఉద్యమానికి ఇంధనంగా ఉపయోగించుకొని తన పోరాటాలను మరింత ఉదృతం చేసేవారు. కానీ ఆయన చేస్తున్న పోరాటం ప్రత్యేక హోదా కోసం కాదు కనుక మళ్ళీ పోరాటం మొదలుపెట్టలేదని భావించకతప్పదు. తనకు ఆసక్తి ఉన్నంత కాలమే ఏదయినా సమస్యపై పోరాడుతారు. అంతకాలమే ఆ సమస్య పెను సమస్య అన్నట్లుగా దానిని ప్రజలకు భూతద్దంలో నుండి చూపిస్తుంటారు. ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటాలకు ప్రజలు స్పందించారని గ్రహించడంతో ఆ సమస్యను కూడా పక్కనపడేసి మరో కొత్త సమస్య కోసం అన్వేషిస్తున్నారు. కానీ ఇంకా ఏమీ దొరికినట్లు లేదు అందుకే ప్రస్తుతం వైకాపాలో స్తబ్దత కనబడుతోంది. మరి తరువాత టాపిక్ ఏమిటో చూడాలి?