జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది. అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ సవాల్‌కు పవన్ కళ్యాణ్ ప్రతి సవాల్ విసరడంతో రాజకీయం వేడెక్కింది. నిజంగా జగన్ అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ముందుకు వెళతాడా లేదంటే వెనకడుగు వేస్తాడా అన్న అంశంపై టీవీ ఛానళ్లలో జోరుగా చర్చ నడిచింది. అయితే చాలా మంది విశ్లేషకులు జగన్ కోరి కష్టాన్ని తెచ్చుకున్నాడని అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని వ్యాఖ్యలు చేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టడం వల్లే ఆయన జగన్ కి ప్రతి సవాలు చేశాడని దీంతో జగన్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో వెనక్కి తగ్గితే జగన్ అభాసు పాలుకావడం ఖాయమని అంటున్నారు . అయితే వెనక్కి తగ్గకుండా ముందుకు వెళితే మాత్రం ఇప్పటికే జగన్ పై నడుస్తున్న కేసులని కేంద్రం వేగవంతం చేస్తుందని దాంతో జగన్ ఇబ్బందులు పడతారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గత వారంలో 2 కొత్త ఛార్జ్ షీట్లు జగన్ కేసుల విషయంలో తెరిచారని వీరు గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి జగన్ ఎప్పటిలాగే మరొకసారి తన దూకుడు తో కష్టాలు కొని తెచ్చుకున్నాడని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.