జగన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నానని.. తనను తాను మోసం చేసుకుంటున్నారు. ప్రతి జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకం డబ్బుల్ని జూన్ కు మార్చి… ఎన్నికలకు వెళ్లే ముందు ఒక విడత ఎగ్గొడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి జనవరిలో అమ్మఒడి కింద ఒక్కో బిడ్డకు పదిహేను వేలు ఇస్తామన్నారు తీరా అమలు దగ్గరకు వచ్చే సరికి ఎంత మంది పిల్లలు ఉన్నా పదిహేను వేలు ఇస్తామన్నారు. చివరికి అది పదమూడు అయింది. పోనీ అదయినా పూర్తిగా ఇస్తున్నారా అంటే… ఒక విడత ఎగ్గొడుతున్నారు.
ప్రతి జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదే డబ్బుల్లేక జూన్ కు మార్చారు. దానికి అనేక కారణాలు చెప్పారు. అందులో ఒకటి లబ్దిదారుల్ని తగ్గించడానికి పెట్టిన హాజరు నిబంధన. అంతకు ముందు ఏడాదిలో ఎక్కువ హాజరు ఉంటేనే ఈ ఏడాది డబ్బులిస్తామని రూల్ పెట్టారు. దీంతో లబ్దిదారుల్ని తగ్గించారు. ఎన్నికలు మార్చి ఏప్రిల్ లో జరుగుతాయి కాబట్టి… ఒక ఏడాది అమ్మఒడిని ఎగ్గొట్టవచ్చని ప్లాన్ చేశారు. దానికి తగ్గట్లుగా వ్యవహారాలు నడుపుతున్నారు.
అమ్మఒడి గురించి జగన్ రెడ్డి మాట్లాడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చే ఉద్దేశంలో కూడా ఆయన లేరు. ఇప్పటికే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. మరో ఆదాయ మార్గం లేదు. సంపద సృష్టి అనేది ఆయనకు చేత కాదు. మళ్లీ వస్తే ఉన్న పథకాలకు గండి పెట్టడం తప్ప ఆయన కొత్తగా ఏమీ చేయలేరు. ఇప్పటికే బటన్లన్నీ ఓటి బటన్లు అయిపోయాయి.