ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో.. ఈ శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కాలేదు. అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తరపు లాయర్లు సీబీఐ కోర్టుకు తెలిపారు. దీంతో.. కోర్టు విచారణను వచ్చే నెల ఆరో తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసుల నిందితుల్లో ఒక్క శ్రీనివాసన్ మినహా ఎవరూ ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. మిగతా వారు కూడా.. ఏదో ఓ కారణం చెప్పి.. డుమ్మాకొట్టారు. దీంతో..విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితిని కోర్టుకు కల్పించినట్లుగా తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు కోరి.. భంగపడినప్పటి నుండి.. ఆయన కోర్టుకు హాజరవుతారా.. కోర్టును ధిక్కరిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఆయన ధిక్కరింపు బాటలోనే ఉన్నారని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి.. ఆయన కోర్టు వైపు రాలేదు. అలాగని… కోర్టు మినహాయింపు కూడా ఇవ్వలేదు. ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. అయితే.. న్యాయవ్యవస్థతో ఇలా ఆటలు ఆడుకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న భావన న్యాయవాద వర్గాల్లో ఉంది.
విచారణను కావాలనే.. ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలను.. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ చేస్తోంది. ఇంత కాలం.. అనేక రకాల పిటిషన్లు వేసి.. అసలు కేసు విచారణలను ప్రారంభించకుండా అడ్డం పడ్డారని.. సీబీఐ పలు సందర్భాల్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆయనకు కోర్టుకు విచారణకు హాజరు కాకపోతూండటంతో.. శరవేగంగా విచారణ కోసం.. రోజువారీ ట్రయల్స్ చేపట్టాలని కోరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. జగన్మోహన్ రెడ్డి రోజూ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ కేసులో జగన్ కాస్త ధిక్కారంగా ఉంటూండటంతో కీలక పరిణామాలు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.