నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల అనంతరం వైకాపా నుంచి భారీ వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. తెర వెనక టీడీపీ చేయాల్సిన మంత్రాంగం చేస్తూనే ఉందనీ చెప్పాలి. వైకాపా నేతలకు తమతో టచ్ లో ఉన్నట్టు అధికార పార్టీ నేతలు లీకులు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైకాపా కొంత అప్రమత్తం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు ముహూర్తం ముంచుకొస్తున్న తరుణంలో, వలస సమస్యపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీని వీడే అవకాశం ఉందంటూ ఈ మధ్య కొన్ని పేర్లు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా నేతలతో జగన్ స్వయంగా భేటీ కావడం విశేషం. కర్నూలు జిల్లా నుంచి ఎంపీ బుట్టా రేణుక, ఇంకొందరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారనే కథనాలు వచ్చాయి. దీంతో బుట్టాతోపాటు ఆలూరు, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలో రాబోతున్నామనీ, ఎవ్వరూ పార్టీ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ వారిని బుజ్జగించినట్టు తెలుస్తోంది. నవంబర్ 2న మొదలుపెట్టే పాదయాత్ర తరువాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతుందని ఆయన భరోసా ఇచ్చారట. బుట్టా రేణుకతో మాట్లాడుతూ.. పార్టీని వీడుతారంటూ కొన్ని కథనాలు వచ్చాయనీ, తమ వద్ద కూడా కొంత సమాచారం ఉందని జగన్ అన్నారు. తనకు అలాంటి ఆలోచనే లేదనీ, పార్టీకి ఎలాంటి సమాచారం చేరిందో తనకు తెలీదని ఆమె చెప్పారట! ఈ సమయంలో రేణుకను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని జగన్ కోరినట్టు సమాచారం. ‘మీలాంటి వారు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే కదా పార్టీ అధికారంలోకి వచ్చేదీ, నేను ముఖ్యమంత్రి అయ్యేది’ అని జగన్ అన్నట్టు కథనం. కానీ, ఆమె వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే సమావేశంలో ఇతర ఎమ్మెల్యేలతో కూడా విడివిడిగా జగన్ సమావేశమై… వచ్చే ఎన్నికల్లో మీ స్థానాలు పదిలంగా ఉంటాయని భరోసా ఇచ్చారట.
మొత్తానికి, జగన్ కు వలస టెన్షన్ పెరిగినట్టుగానే కనిపిస్తోంది. అయితే, దీన్ని డీల్ చేసే విధానం సరిగా లేదనేది విశ్లేషకుల వ్యాఖ్య. ‘మీరు పార్టీ నుంచి వెళ్తారనే సమాచారం మా దగ్గర ఉందీ’ అని ఆయా నేతలతో నేరుగా మాట్లాడితే ఎలా..? అంటే, పార్టీ కూడా తమను అనుమానిస్తోందా అనే అభిప్రాయం వారిలో కలిగే అవకాశం ఉంటుంది కదా. ‘ఇలాంటి కథనాలు రాకుండా జాగ్రత్త పడండి’ అని చెప్పాలిగానీ… వాటిని పార్టీ కూడా బలంగా నమ్ముతున్నట్టుగా జగన్ స్వయంగా చెప్పడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాబోతుందని భరోసా ఇవ్వడం వరకూ ఫర్వాలేదు. కానీ, మీ స్థానాలు పదిలం అని ఇప్పుడే చెప్పడం కూడా సరైన వ్యూహం కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే, ఎన్నికల నాటికి చాలా సమీకరణలు మారతాయి. టిక్కెట్లు కేటాయింపు అనేది అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాల్సి వస్తుంది. గెలిచే అవకాశం ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తారు. అంతేగానీ.. వలస వెళ్లాలనుకునేవారిని పార్టీలో ఉంచడం కోసం టిక్కెట్లు ఖాయం అని ఇప్పుడే చెప్పేయడం సరికాదనే కొందరు అంటున్నారు. ఇతర నేతలకూ ఇదే ఆదర్శంగా మారే అవకాశం ఉంటుంది కదా! ఏదేమైనా, తాను పాదయాత్రకు బయలుదేరేలోగా వలసలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.