తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో నిరాహార దీక్షకి కూర్చొన్న జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణా ముఖ్యమంత్రి కృష్ణా, గోదావరి నదులపై తన ఇష్టం వచ్చినట్లు కడుతూ, ‘నా ఇష్టం వచ్చినట్లు కట్టు కొంటాను మీరు ఎలాగ పోయినా పరువాలేదన్నట్లుగా హిట్లర్ లాగ మాట్లాదుతున్నారని విమర్శించారు. మీరు కట్టే ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం, కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల నుంచి అనుమతులు తీసుకోన్నారా? అని ప్రశ్నించారు. విభజన చట్టాన్ని పట్టించుకోకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు కడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఆ నదీ జలాలు ఎవడబ్బసొమ్మని మీరు వాడేసుకోవాలనుకొంటున్నారు? అని ప్రశ్నించారు. మీరు కడుతున్న ప్రాజెక్టుల వలన దిగువనున్న ఆంధ్రా ఎడారిగా మారిపోతుందనే ఆలోచన కూడా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొంటున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ కూర్చోన్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడుకి తెలిసున్నా ఓటుకి నోటు కేసుకి భయపడే కేసీఆర్ ని గట్టిగా నిలదీసి అడగడం లేదు. తెలంగాణా ప్రభుత్వం ఇలాగే ప్రాజెక్టులు కట్టుకొంటూపోతే, బ్రహ్మం గారు చెప్పినట్లుగా రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు నీళ్ళ కోసం కొట్టుకొనే పరిస్థితులు ఏర్పడవచ్చని అన్నారు. అప్పుడు ఇండియా-పాకిస్తాన్ దేశాలలాగ పోరాడుకోవలసి వస్తుందేమోనని జగన్ ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ హైదరాబాద్ ని ఎత్తుకొని పోయారు. ఇప్పుడు మన నీళ్ళని కూడా దోచుకోవాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు. నీళ్ళ పంపకాలన్నీ విభజన చట్టంలో సూచించిన విధంగానే జలసంఘాలు అద్వర్యంలో జరగాలి తప్ప ఎగువన ఉన్నాము కదా మా ఇష్టం మాకు కావలసినన్ని నీళ్ళు తోడేసుకొంటామని హిట్లర్ లాగ చెపితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ని జగన్ హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డి తన బద్ధ శత్రువయిన చంద్రబాబు నాయుడు నిత్యం విమర్శించడం, ఆరోపణలు చేయడం నిత్యం వింటున్నదే కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇంత తీవ్రంగా విమర్శించిన దాఖలాలు లేవు. గత అనేక ఏళ్లుగా తెరాస, వైకాపాలు కూడా పెద్దగా విమర్శించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిద్దరికీ శత్రువు కావడం చేత వాటి మద్య ఏదో చక్కటి అవగాహన ఉన్నట్లుగానే వ్యవహరించేవి. కానీ మొట్టమొదటిసారిగా జగన్ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం ఆయన ప్రాజెక్టులు కట్టడమే అంటే నమ్మశక్యంగా లేదు. కేసీఆర్ నిర్ణయాల వలన ఆంధ్రాకి నష్టం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న జగన్, మరి గత రెండేళ్లలో కేసీఆర్ తీసుకొన్న అనేక నిర్ణయాల వలన రాష్ట్రానికి, ప్రజలకి, ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఏర్పడినా ఎందుకు స్పందించలేదు? అని ఆలోచిస్తే, ఇప్పుడు జగన్ మాటలను అనుమానించవలసి వస్తోంది. కారణాలు ఎవయినప్పటికీ ఇప్పటికయినా జగన్ ధైర్యంగా నిలబడి కేసీఆర్ తో పోరాడితే ప్రజలు కూడా ఆయనకు మద్దతు ఇస్తారు.