ఆటోలకు అభయం యాప్‌ను ఆవిష్కరించే అభయం పథకాన్ని జగన్ కంప్యూటర్లో మీట నొక్కి ప్రారంభించారు. తొలి దశలో విశాఖలో కొన్ని ఆటోలకు..ఈ యాప్ అనుసంధాన ఐవోటీలను ఆటోల్లో బిగిస్తున్నారు. అద్భుతమైన పథకమని.. మహిళల రక్షణలో జగన్ చూపిస్తున్న విజన్‌కు తార్కాణం అని వైసీపీ నేతలు పొగుడుతున్నారు. మరి ఈ అభయం కొత్తదా..? ఏపీ సర్కార్ దీనికి నిధులు ఖర్చు పెడుతున్నారా..? అంటే.. అసలు విషయం తెలిస్తే అవాక్కవక తప్పదు.
2018 డిసెంబర్లో అభయ.. 2020 నవంబర్‌లో అభయం..! ఇదే తేడా..!
అభయం ప్రాజెక్ట్‌ను విస్తృత స్థాయిలో అమలు చేయడం లేదు. ఒక్క సారి ఏపీలో ఉన్న మొత్తం ఆటోలకు పెట్టేసి.. భద్రతను అందుబాటులోకి తెచ్చారా ..అంటే అదీ లేదు. అరకొరగా.. వందల్లో ఐవోటీలను ఆటోలకు అమర్చి..ఇక మహిళల భద్రతకు తిరుగులేదన్నారు. అదీ కూడా ఒక్క విశాఖకే పరిమితం. వాస్తవానికి అ అరకొర అభయం.. ఎప్పుడో.. 2018లోనే చంద్రబాబు ప్రారంభించారు. కానీ ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ పబ్లిసిటీ అయితే చేసుకున్నారు మీడియాలో వచ్చింది. మొత్తంగా 138 కోట్ల రూపాయలతో లక్ష ఐటోరిక్షాలకు.. ఐవోటీలు పెట్టి.. రక్షణ కల్పించాలనుకున్నారు. ఆ అభయ కాస్తా.. రీఓపెనింగ్లో అభయంగా మారింది. అంతే తేడా..!
దిశ ఉండగా… మళ్లీ ప్రత్యేకంగా అభయం ఎందుకు..!?
నిజానికి ఈ అభయం ప్రాజెక్ట్ ఏపీ సర్కార్‌ది కాదు.. కేంద్ర ప్రభుత్వానిది. ఇంతకు ముందే.. అభయం ఫీచర్స్ అన్నింటినీ కలిపి..దిశ యాప్ తీసుకు వచ్చింది. మీట నొక్కితే.. పది నిమిషాల్లో పోలీసులు వాలిపోయేలా దాన్ని రూపొందించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రత్యేకంగా అభయం యాప్ ఎందుకు..? దిశ యాప్ కోసం ప్రత్యేకంగా ఆటోలకు ఐవోటీలు అమర్చాల్సిన పని లేదు. కేవలం.. మహిళలు తమ ఫోన్లో యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని అవసరం అనుకున్నప్పుడు… ఆపదలో ఉన్నప్పుడు.. మీట నొక్కితే పోలీసులు వస్తారు. యాప్ లాంచ్ చేసినప్పుడు..ఆర్టీసీ బస్సులో వేధింపులకు గురవుతున్న ఓ మహిళ అలాగే మీట నొక్కారని.. తాము కాపాడామని.. పోలీసులు గతంలో ప్రకటించారు. అంటే.. ఐవోటీ ఉన్న ఆటోల్లోనే కాదు.. ఎక్కడైనా దిశయాప్ ఉపయోగపడుతుంది. మరి అభయం యాప్ ను ఆవిష్కరించాల్సిన అవససరం ఏమిటి..?
కేంద్రం ప్రకటించిన నిర్భయ స్కీంలో భాగం అభయం యాప్..!
అభయం యాప్ అనేది కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీం లో భాగం. 2018లోనే ఏపీ సర్కార్ ఈ నిర్భయ స్కీంలో చేరింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దాదాపు లక్ష ఆటో లను అభయం ప్రాజెక్ట్ కిందకు తీసుకురానున్నారు. ప్రతి ఆటో లోనూ అభయం అనే మొబైల్ అప్లికేషన్ ను రవాణాశాఖ అధికారులు ఇన్స్టాల్ చేస్తారు. దీనిలో ఆటో నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు. ఆటో లో ప్రత్యేకంగా పానిక్ బటన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటో లలో ప్రయాణించే మహిళలు, పిల్లలు ఎవరైనా ఆపద ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే.. బటన్ ను నొక్కాలి. ఇలా బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది. అంతేకాకుండా బటన్ నొక్కిన వెంటనే ఆటో నుండి హెల్ప్ అని శబ్దం రావడంతో పాటు.. కొద్దీ దూరం వెళ్ళగానే వాహనం ఆటో మ్యాటిక్ గా ఆగిపోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర నిర్భయ స్కీం కింద అరవై శాతం నిధులు ఇస్తుంది. ఏపీ సర్కార్ నలభై శాతం నిధులు కేటాయిస్తుంది. గత ప్రభుత్వమే ఈ స్కీమ్‌ను అడాప్ట్ చేసుకున్నందున.. కొత్త ప్రభుత్వానికి వెనక్కి పోవడానికి అవకాశం లేకుండా పోయింది. లేకపోతే… అభయం యాప్ కన్నా అత్యాధునికమైన దిశ యాప్ ఉందని.. ప్రభుత్వం ఎప్పుడో తిప్పికొట్టేదని సులువుగానే అంచనా వేయవచ్చు.
కేంద్ర పథకాలకు జగనన్నముద్ర..! అదే మార్పు..!
దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా నిర్భయ స్కీంను కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు కోసం ఏడాదికి రూ.2 వేల కోట్లను కేటాయించింది. అందులో భాగంగా ఏపీకి నిధులు కేటాయించారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వనుండగా, రాష్ట్రప్రభుత్వం 40 శాతం ఇవ్వాల్సివుంటుంది. ఈ పథకంలో ఒక్క అభయం యాప్ మాత్రమే కాదు.. ఎక్కువ సామర్థ్యం కలిగిన సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, ఆధునిక టాయిలెట్ల, అత్యవసర సహాయ నెంబరు, మొబైల్ యాప్‌లు రూపొందించడం, మహిళా పోలీసులతో గస్తీ వాహనాల నిర్వహణ వంటి అనేక పనులు కూడా చేయవచ్చు.