మూడు రాజధానుల ఆలోచన.. దేశం మొత్తాన్ని ఆశ్చర్య పరుస్తోంది. ఎంతగా అంటే.. తమ రాష్ట్రం చాలా పెద్దదని.. ఒక్క రాజధానినే ఉందని.. ఎలా పరిపాలించాలో.. తమ దగ్గరకు వస్తే చెబుతామని.. సెటైర్లు వేసేంతగా..! అసలు మూడు రాజధానులు.. అదీ కూడా.. ఓ చోట సెక్రటేరియట్..మరో చోట అసెంబ్లీ.. మరో చోట హైకోర్టు పెట్టడం ఏమిటని.. అది ఆచరణ సాధ్యం కాదని.. నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇదేదో.. మానసికంగా బుర్ర ఎదగని వ్యక్తులు తీసుకునే నిర్ణయాల్లా ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ నియమించిన కమిటీలు.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మాత్రమే మూడు రాజధానులు.. పాలనా వికేంద్రీకరణ బాగుంటుందని నివేదికలిచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది కాబట్టి.. పేమెంట్ చేసి.. ముఖ్యమంత్రి కాబట్టి.. ఆయనకు నచ్చినట్లుగా నివేదికలు ఇస్తారని.. అందులో విశేషం ఏముందన్న చర్చ కూడా సహజంగానే వస్తోంది.
బీసీజీ, జీఎన్ రావు కమిటీలు మినహా… పాలన సహా.. రాష్ట్ర విభజనకు సంబంధం ఉన్న ప్రతి ఒక్క ఒకరి నుంచి.. మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయమే వినిపిస్తోంది. విభజన చట్టం రూపొందించడంలో మాస్టర్ మైండ్ గా పని చేసిన జైరాం రమేష్ కూడా.. అదే అభిప్రాయాన్ని చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదన సాధ్యమయ్యే విషయం కాదని …. ప్రస్తుతం ఉన్న చోటే ఏపీ రాజధానికి అనుకూలమైన ప్రాంతమని తేల్చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలు వేర్వేరు చోట్ల ఉండడం కూడా సాధ్యం కాదన్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా… జైరాం చెప్పారు. మద్రాసు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు 1953లో కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో గుంటూరులో హైకోర్టు పెట్టాలనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదని గుర్తు చేశారు.
వివిధ రంగాల్లో నిపుణులతో పాటు.. సామాన్య ప్రజల్లోనూ.. మూడు రాజధానులు ఎలా సాధ్యమన్న చర్చ జరుగుతోంది. ఓ చోట ఇల్లు కట్టి..మరో చోట వంట గది.. ఇంకో చోట బాత్ రూమ్ కట్టాలనే ఆలోచన ఎవరూ చేయరని.. కానీ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. రాజధాని విషయంలో అలాంటి ఆలోచనలే చేశారని.. సామాన్యుల్లో చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇలాంటివి బాగా వైరల్ అవుతున్నాయి. నిన్నటిదాకా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే.. పాలనా వికేంద్రీకరణే అని చెప్పాలని అధికారపక్షం ఆరాటపడింది. కానీ ఇప్పుడు.. పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అది ఎలా అని.. తర్వాత తర్వాత చెప్పుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడొచ్చు..!