ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ గతం లో ప్రకటించారు. 2017 జూన్ కల్లా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా అస్త్రం ప్రయోగిస్తానని ఆయన అన్నారు. అయితే జూన్ పోయి అక్టోబర్ కూడా వచ్చింది. రాజీనామా ఊసు లేదు. అయితే మొన్న యువభేరి లో రాజీనామా అస్త్రం మిగిలే ఉందని, పాద యాత్ర అయ్యేలోపు రాజీనామాలు ఉంటాయని ప్రకటించారు. అయితే ఇందులో జగన్ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడని విశ్లేషకులంటున్నారు.
నిజానికి వైసిపి ఎంపీలకి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకి వెళ్ళడం ఇష్టం లేదు. ఖర్చు కూడుకున్న వ్యవహారం మరి ఎన్నికలంటే. జగన్ గత ఏడాది ప్రకటన చేసినపుడే వాళ్ళు ససేమిరా అన్నారు. అయితే జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే మళ్ళీ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ లో ప్రారంభమయ్యే యాత్ర మార్చ్ – ఏప్రిల్ కల్లా పూర్తవుతుంది. పాదయాత్ర పూర్తయ్యే సమయం లో మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడి..సరిగ్గా ఎన్నికలకి ఆర్నెల్లు ఉందనగా వైసిపి ఎంపీలతో రాజీనామా చేయించే ఉద్దేశ్యం లో ఉన్నట్టు వైసిపి వర్గాలంటున్నాయి. అలా చేయడం వల్ల ప్రత్యేక హోదా కోసం రాజీనా చేసారన్న కారణం తో వైసిపి ఎంపీలకి మైలేజ్ వస్తుంది. పార్టీకి మైలేజ్ వస్తుంది. అలాగే ఎక్స్ ట్రా ఎలక్షన్స్ ఫేస్ చేసి డబ్బు ఖర్చు పెట్టుకునే అవసరం తప్పుతుంది. సార్వత్రిక ఎన్నికలకి ఆర్నెల్ల ముందు మాత్రమే రాజీనామా చేయడం వల్ల ఎలక్షన్ కమీషన్, సార్వత్రిక ఎన్నికలతో పాటే వీరి స్థానాలు కూడా భర్తీ చేస్తుంది తప్ప ఆర్నెల్ల లోనే రెండు సార్లు ఎలక్షన్స్ నిర్వహించదు.
వైసిపి వర్గాల్లో ప్రచారం లో ఉన్న ఈ స్ట్రాటజీ ఎంతవరకో నిజమో కాలమే చెప్పాలి. కానీ, ఇలాంటి స్ట్రాటజీ లని ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే చిత్తశుద్ది తో చేసే ప్రయత్నాలని మాత్రం జనం మనస్పూర్తి గా ఆహ్వానిస్తారు. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీలని నమ్ముకునే బదులు, చిత్తశుద్ది తో ప్రజల మనసులు గెలుచుకోవడం బెటర్.