వైఎస్ చనిపోయాక.. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం పదవి ఇవ్వలేదు. ఎప్పటికైనా సొంత పార్టీ పెట్టుకోక తప్పదని వైఎస్ చనిపోయినప్పుడే పక్కాగా ప్లాన్ చేసుకున్నారేమో కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో చనిపోయిన వారందరి పేర్లు సాక్షి లో రాసుకుని వారు వైఎస్ కోసమే చనిపోయారని లెక్కేశారు. చివరికి వారందరినీ ఓదారుస్తానంటూ రాజకీయం చేశారు. అప్పట్నుంచి సీఎం అయ్యే వరకూ జగన్ జనంలోనే ఉన్నారు. ఓదార్పు యాత్రలు చేశారు. ఓ సారి ఓడిపోయాక పాదయాత్రలు చేశారు. జనంలో ఉన్నారు . కానీ పదవి చేపట్టిన తర్వాత మాత్రం ఆయన మారిపోయారు. జనం అంటే.. దూరం దూరంగా ఉంటున్నారు. ఎవర్నీ కలవడం లేదు.
జనానికి దగ్గరగా ఉంటానని నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్ిచన జగన్
పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రజలను కలిసేందుకు ఎందుకు ఆసక్తి చూపించడం లేదో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. సీఎంగా పదవి చేపట్టి నాలుగేళ్లవుతోంది. ఆయన ఏ దశలోనూ ప్రజలతో ఇంటరియాక్ట్ కాలేదు. కరోనా కారణంతో అసలు బయటకే చాన్నాళ్లు రాలేదు. ఇక ఉన్నతాధికారులకే దర్శనం ఉండదు. మంత్రులు… ఇతరులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా చేయాల్సిందే. ఎప్పుడైనా బయటకు వస్తే.. తాడేపల్లి నుంచి గుంటూరుకు కూడా హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తారు. జనంను కలిసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు .
పదవి వచ్చినా ప్రజలతో పని లేదన్నట్లుగా జగన్ !
ప్రజల్ని కలిసేందుకు ప్రతీ ముఖ్యమంత్రి ప్రతీ రోజూ ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. అది సంప్రదాయం. కానీ జగన్ మాత్రం ప్రజలతో పని లేదనుకున్నారు. అధికారం చేపట్టిన మొదట్లో ఆయన ప్రజాదర్బార్ పెడతానని చెప్పి… తేదీ కూడా ఇచ్చారు. ఆ రోజున వెల్లువలాజనం వచ్చారు. కానీ క్యాన్సిల్ అని ఒక మాట చెప్పి అందర్నీ పంపేసారు. అది మొదలు.. ఇదిగో దర్బార్.. అదిగో దర్బార్ అని ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ప్రజల్ని కలిసిందే లేదు. ఇటీవల కూడా.. అలాంటి ప్రకటన చేశారు. రోజూ గంట సేపు జనాల్ని కలుస్తానని చెప్పారు. కానీ అమలయ్యే సూచనలు కనిపించడం లేదు.
పరదాలు… బారికేడ్ల మధ్య పర్యటనలు !
ఎన్నికల కోసం జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. పోనీ జిల్లాల్లో అయినా ప్రజల్ని కలుస్తున్నారా అంటే.. .దూరం నుంచి చూసి.. వెళ్లి పోయే చాన్స్ మాత్రమే ప్రజలకు ఇస్తున్నారు. తన దారిలో పరదాలు కట్టేస్తున్నారు. బారీ కేడ్లు పెట్టేస్తున్నారు. వందల మంది పోలీసుల్ని మోహరింప చేస్తున్నారు. ఈ తీరు చూసి చాలా మంది జనం.. పాదయాత్ర చేసిన జగనేనా అని చర్చించుకోవడం కామన్‌గా మారింది.
సమస్యలపై ప్రజలు నిలదీస్తారని భయమేనా ?
సీఎం పదవి ప్రజలు ఇచ్చింది. ఆయన పాదయాత్రలు చేసి.. మంచి చేస్తానని నమ్మించి.. అందుబాటులో ఉంటానని నమ్మకం కలిగించడం వల్ల వచ్చిన పదవి అది. తీరా పదవి వచ్చిన తర్వాత ఇలా వ్యవహారించడం వల్ల.. ఆయనప్రజలకు భయపడుతున్నారని అనుకుంటున్నారు. పాలన భయంకరంగా ఉంది కాబట్టి.. ఇలా చేస్తున్నారని అంటున్నారు. బహుశా ఇది నిజం కూడా కావొచ్చు.