ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఎలాగైనా డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకు రావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టువదలని ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రధానితో భేటీకి ఆమెను కూడా తీసుకెళ్లడమే దీనికి నిదర్శనం. ఇప్పటికీ తెలంగాణ క్యాడర్లో ఉన్న శ్రీలక్ష్మి ఏపీ సీఎం వెంట … ప్రధానితో భేటీకి వెళ్లిన బృందంలో ఉండటం.. చతాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే… తెలంగాణ నుంచి ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మిలను ఏపీకి తీసుకు వచ్చి పెద్ద పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది అటు కేసీఆర్ ఇటు జగన్ వ్యక్తిగత వ్యవహారం కాదు కాబట్టి.. కేంద్రం అనుమతి కావాల్సి వచ్చింది. ముఖ్యమంత్రులు అంగీకరించారు కాబట్టి.. కేంద్రానికి అభ్యంతరం ఏమీ ఉండదనుకున్నారు. కానీ ఢిల్లీ మాత్రం అలా అనుకోలేదు. ఈ డిప్యూటేషన్లకు వారికి చాలా అభ్యంతరాలు కనిపించాయి.
ఏపీలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా… స్టీఫెన్ రవీంద్రను నియమించాలనుకున్న జగన్ కు కేంద్రం డైరక్ట్ షాక్ ఇచ్చింది. మూడు నెలల పాటుపెండింగ్ లో పెట్టి.. తర్వాత కుదరదని చెప్పేసింది. దాంతో.. ఏపీలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర… తర్వాత తెలంగాణ విధుల్లో చేరిపోవాల్సి వచ్చింది. అయితే… శ్రీలక్ష్మి విషయంలో మాత్రం కేంద్రం ఇంకా ఏ నిర్ణయమూ చెప్పలేదు. దాంతో.. జగన్మోహన్ రెడ్డి కొంచెం ఆశలు పెట్టుకున్నారు. ఆమె డిప్యూటేషన్ దరఖాస్తును క్లియర్ చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏదీ వర్కవుట్ కాకపోవడంతో.. చివరికి తాను.. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా… శ్రీలక్ష్మిని కూడా తీసుకెళ్తున్నారు. ప్రధానమంత్రి నివాసానికి కూడా తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడా సానుకూల సూచనలు కనిపించడం లేదు.
జగన్‌తో పాటు అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మిని ఏపీలో పని చేసేందుకు తీసుకు రావడానికి జగన్ ఎందుకు అంత తాపత్రయ పడుతున్నారన్నదానిపై.. ప్రధానమంత్రి కార్యాలయంలోనే చర్చ జరుగుతోంది. సాధారణంగా.. సహ నిందితులకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ పెద్దలు ఎక్కడా కనిపించరు. విమర్శలు వస్తాయన్న కారణంగా అయినా దూరం పెడతారు. కానీ.. సీఎం జగన్ మాత్రం ఆమెను ఏపీకి తీసుకు వచ్చి.. తన పేషీలోనే పెట్టుకోవాలన్న ఆలోచన చేస్తూండటం.. అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది. శ్రీలక్ష్మి డిప్యూటేషన్ ను పెండింగ్‌లో పెట్టడానికి ఇదే ఓ కారణం అన్న చర్చ కూడా.. వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.