వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినా… శంఖారావం సభలు పెట్టినా… అలాగే.. తన మీడియాలో కథనాలు ప్రచురింప చేసినా.. పార్టీ నేతలతో మాట్లాడింప చేసినా.. ఒక్కటే చెబుతున్నారు. తాను ఇవ్వాలనుకున్న హామీలను .. చంద్రబాబు కాపీ కొట్టేశారని.. తాను ఇద్దామనుకున్నవి.. చంద్రబాబు ఇచ్చేస్తున్నారనేదే.. ఆ మాటల సారాంశం. ఆయనది ఆరోపణ అని అనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలకు మాత్రం ఆవేదనలా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత తమ కోసం ఇంత బాగా ప్రచారం చేస్తున్నారని.. వారు సంతోషపడుతున్నారు. ఇవ్వాలనుకున్నవన్నీ చంద్రబాబే ఇచ్చేస్తున్నాడని.. జగనే చెప్పిన తర్వాత ఇక ప్రజలు… ఏదో ఇస్తాడని..జగన్‌కు ఎందుకు ఓటేస్తారు..?
నవరత్నాలను చంద్రబాబు అమలు చేసేశారని జగన్ ప్రచారం.. !
వృద్ధాప్య పెన్షన్లు రెండు వేలు చేయడం, రైతులకు నగదు సాయం లాంటి నవరత్నాలను…వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు. కానీ.. తెలుగుదేశం ప్రభుత్వం.. వాటి కోసమే… జగన్మోహన్ రెడ్డికి ఓటేయాల్సిన అవసరం లేదనే సందేశం ఇస్తూ… ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అమలు చేయడం ప్రారంభించింది. దీంతో వైసీపీకి.. చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శలు చేయడానికి మాత్రమే అవకాశం దొరికింది. జగన్ ఇద్దాం అనుకున్నారు… చంద్రబాబు ఇచ్చేస్తున్నారు.. అదంతా జగన్ గొప్పదనమే అని ప్రచారం చేసుకుంటే.. వర్కవుట్ అవుతుందా ..?. ఈ విషయంలో జగన్ మాత్రం దూకుడుగా ఉన్నారు. కానీ ఇతర వైసీపీ నేతల్లో మాత్రం ఆందోళన ఉంది. ఎందుకంటే.. ఇస్తామని నోటి మాటగా చెప్పిన వారి కన్నా.. ఇచ్చిన వారినే ఎక్కువ మంది గుర్తు పెట్టుకుంటారు. అందుకే.. జగన్ వస్తే ఇప్పుడు వస్తే ఏం చేస్తారు..? ఇప్పటి వరకూ చెప్పినవన్నీ అమలు జరిగిపోతున్నాయి కదా..! అన్నదే ఓటర్ల మదిలో వస్తున్న సందేహం. ఓటర్ల మదిలో కాదు.. వైసీపీ నేతల మనసులోనూ ఇదే ఉంది. కానీ ఏం చెప్పుకోవాలో వారికి అర్థం కావడం లేదు.
టీడీపీకి జగన్ ప్రచారం చేస్తున్నట్లే కదా..!
ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్న పెన్షన్లు, పసుపు – కుంకుమ, అన్నదాత సుఖీభవ సహా.. సంక్షేమ పథకాలకు.. కొనసాగింపుగా రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తే.. అది టీడీపీకే అడ్వాంటేజ్ అవుతుంది. ఆ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమయింది. టీఆర్ఎస్ అధినేత ప్రవేశ పెట్టిన పథకాలకు.. రెట్టింపు మొత్తం ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించింది. అదనంగా… రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రకటించింది. కానీ ప్రజలు నమ్మలేదు. అసలు వాళ్లు వస్తే ఇస్తారో లేదో.. అన్న స్పృహ ప్రజలకు రావడం వల్లే. ఎంతో కొంత ఇస్తున్నారు కదా… ఎందుకు చెడగొట్టుకోవడం అన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీకి… ఆ హామీలేమీ కలసి రాకపోగా.. టీఆర్ఎస్ కు మేలు జరిగింది. ఇప్పుడు వైసీపీలోనూ అదే ఆందోళన కనిపిస్తోంది. తాము నవరత్నాలను.. చంద్రబాబు అమలు చేసేస్తున్నారని.. తాము వస్తే ఇంకా .. ఇంకా ఇస్తామని చెబితే… దాని వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువ జరుగుతుందని.. విశ్లేషించుకుంటున్నారు.
ప్రచారంపై జగన్ వ్యూహం మార్చుకోవాల్సిందే..!?
జగన్ ఇప్పుడు ప్రజలను ఆకట్టుకోవడానికి శంఖారావం సభల్లో ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వలేకపోయారు. వృద్ధాప్య పించన్లు మూడు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు కానీ… అందులోనూ క్లారిటీగా చెప్పలేకపోయారు. మూడు వేల వరకు పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. అంటే.. ఒకవేళ గెలిస్తే.. వెంటనే పెంచుతామని… చెప్పలేదని కవర్ చేసుకోవాడనికి.. అలా ప్రసంగించారు. కాబట్టి.. ఈ మూడు వేలు అంశం కూడా.. సామాజిక పెన్షన్లు అందుకునేవారిలోకి వెళ్లే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ అంటే… జగన్ అసాధ్యం అన్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా పథకాలు ప్రకటిస్తే ప్రజలు నమ్మరు. అందుకే.. జగన్ ఇప్పుడు సూప్‌లో పడిపోయారు. టీడీకి ప్రచారం చేస్తున్నారు. దీన్నుంచి ఆయన బయటకు రావాల్సి ఉంది.