పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి..చెప్పడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మకంగానే పవన్‌పై తీవ్రమైన విమర్శలను జగన్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ విమర్శల వెనుక ఉన్న ప్రధాన కారణం.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణ పరిస్థితులు, చర్చలను డైవర్ట్ చేయడమేనని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజులుగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి .. అటు పార్టీ పరంగా.. ఇటు.. నిర్ణయాల పరంగా ఏదీ కలసి రావడం లేదు. ముఖ్యంగా లోక్‌సభ ఎంపీలతో రాజీనామాలు అతి పెద్ద సెల్ఫ్‌గోల్‌గా మారాయి. టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తూంటే.. వైసీపీ ఎంపీలు.. గాంధీ విగ్రహం ముందు నిలబడాల్సి వచ్చింది. బంద్‌కు పిలుపు ఇస్తే ప్రజల నుంచి వచ్చిన స్పందన.. పార్టీ బలాన్ని కూడా ప్రశ్నార్థకం చేసింది.
బీజేపీతో కుమ్మక్కవడం వల్ల రాజీనామాలు చేశారన్న ఆరోపణలు రావడమే కాదు….ప్రజలు కూడా నమ్ముతున్నారన్న ఫీడ్ బ్యాక్ వైసీపీకి వచ్చింది. అదే సమయంలో .. తాను పిలుపునిచ్చిన బంద్‌కు ప్రజల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. బంద్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత.. ఎంపీల రాజీనామాల అంశంతో..ఇమేజ్ చాలా డ్యామేజ్ అయినట్లు తెలుసుకున్నారు. ఈ అంశం ఎక్కువ రోజులు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంటే… మొత్తానికే మోసం వస్తుందని.. టాపిక్ డైవర్ట్ చేయాలని నిర్ణయించుకునే వ్యూహాత్మకంగా.. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసినట్లు… తెలుస్తోంది.
ఓ వైపు రాజ్యసభలో విభజనహామీలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రత్యేకహోదా ఇవ్వబోమని.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో స్పష్టంగా చెప్పారు. జగన్ ప్రెస్ మీట్ పెట్టేసరికే.. ఆ చర్చ ముగిసింది. కానీ జగన్ ఒక్క మాటంటే.. ఒక్క మాట కూడా రాజ్యసభ చర్చ మీద మాట్లాడలేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. చర్చలో పాల్గొన్నా.. బలమైన వాదన వినిపించలేదు. ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది..వైసీపీనే అని విడమర్చి చెప్పేసరికి.,. వెంకయ్యనాయుడు మైక్ కట్ చేశారు. అదే సమయంలో సుజనా చౌదరి, సీఎం రమేష్… లాంటి వాళ్లు.. కేంద్రానికి నేరుగా సవాళ్లు చేశారు. ఇది కూడా ప్రజల్లో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఏర్పడింది.
ఈ వ్యవహారాల నుంచి.. టాపిక్ డైవర్ట్ చేయాలంటే.. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలే మంచి మార్గమని.. జగన్మోహన్ రెడ్డి భావించి ఉంటారని అంచనా వేస్తున్నారు. లేకపోతే.. ఇంత హఠాత్తుగా… పవన్‌పై వ్యక్తిగతంగా ఎటాక్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. పార్లమెంట్, అసెంబ్లీను బహిష్కరించడంపై…టీడీపీ నేతలు ఎన్నో విమర్శలు చేశారు. చేస్తూనే ఉన్నారు. వారినెవర్నీ జగన్ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ పవన్‌ను మాత్రం.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. దీని డైవర్షన్ వ్యూహమే ఉందన్న అభిప్రాయాలున్నాయి.