ఏపీ ప్రభుత్వం స్టైలే వేరు. ఎవరైనా ఎన్నికల్లో హామీ ఇచ్చారు అమలు చేయండి అని వస్తే.. దాన్ని పక్కన పెట్టేసి వారినే తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకోగల చాతుర్యం.. సంపాదించుకుంది. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో అదే జరుగుతోంది. ఇలా కుర్చీ ఎక్కగానే అలా సీపీఎస్ రద్దు అని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హామీ ఇస్తే పొంగిపోయారు ఉద్యోగులు. రెండు చేతులతో ఓట్లేశామని ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు. కానీ ఇప్పుడు సీపీఎస్ రద్దు చేయకపోగా… ఆ సీపీఎస్‌కు ఉద్యోగులు ఇస్తున్న వాటాను కూడా హామీగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటోంది.
కేంద్ర మంత్రి లోక్‌సభలో ఈ విషయం చెప్పబట్టే బయట ప్రపంచానికి తెలిసింది. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు జమ చేస్తున్న మొత్తాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. వాటిని హామీగా పెట్టుకుని రూ. నాలుగు వేల కోట్లకుపైగా రుణాలు తీసుకునేందుకు ఏపీ అనుమతి పొందింది. ఈ అప్పులు తీసుకుంటే భవిష్యత్‌లోనూ సీపీఎస్ రద్దు చేసే చాన్స్ ఉండదు. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేయకుండా ప్రభుతవ్వం చేస్తున్న అప్పులు అడ్డం పడతాయి.
సీపీఎస్ రద్దు చేస్తే ఎన్నో సమస్యలు చెబుతున్న ఏపీ ప్రభుత్వం… అదంతా ఉత్తవేనని ఉద్యోగులు నమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాలు సీపీఎస్ రద్దును ఓ రాజకీయ నిర్ణయం మేరకు తీసుకుంటున్నాయి. కానీ ఏపీలో మాత్రం హామీ ఇచ్చి మరీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. పైగా భవిష్యత్‌లో ఎవరూ రద్దు చేయకుండా చేయడం ద్వారా ఉద్యోగులకు నమ్మక ద్రోహం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్క సీపీఎస్ విషయలోనే కాదు ప్రతీ విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తూండటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.