ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో ఏపీ రాజధాని ప్రస్తావన తీసుకు రావడం.. విశాఖకే తరలి వెళ్తున్నామని అక్కడే పెట్టుబడులు పెట్టాలని పిలుపునివ్వడం రాజకీయ సంచలనంగా మారింది. ఆయన తీరుపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు ఎలా విశ్వాసం చూపిస్తారని… జగన్ లక్ష్యం కోర్టును ప్రభావితం చేయడమే కానీ.. పెట్టుబడుల సాధన కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
విశ్వసనీయత అన్నదే లేకుండా జగన్ తీరు !
మూడు రాజధానుల విధానంలో భాగంగా సీఎం జగన్ ఎప్పుడు మాట్లాడినా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే పదం వాడేవారు కానీ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖను కేవలం కేపిటల్ అని చెబుతున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రమోట్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని.. మూడు రాజధానులు అనే పదం లేకుండా జాగ్ర్తత పడాలని అనుకున్నారని కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే మూడు రాజధానుల్లో అదొక రాజధాని అన్న అభిప్రాయం కలగనీయలేదు. తాను కూడా షిఫ్ట్ అవుతున్నానని చెప్పడం ద్వారా ఏదే ఏకైక రాజధాని అని సంకేతాలను ఇచ్చారు. అయితే ఈ క్రమంలో తన యూటర్నులు… త న మోసపూరిత విధానాలకు గుర్తులుగా మిగిలిపోతాయని ఊహించలేకపోయారు.
మండించిన రాజకీయ మంటల్లో మాడిపోయిన రాష్ట్రానికి ఏం చెబుతారు ?
ఏపీ ప్రభుత్వ విధానం మూడు రాజధానులు. ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని చెప్పినప్పటికీ .. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకు దక్షిణాఫ్రికాలో ఉన్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దానిపై అనేక అభ్యంతరాలు.. న్యాయవివాదాలు ఏర్పడ్డాయి. ఇటీవల మూడు రాజధానులు అనే వాదన కూడా వినిపించడం తగ్గింది. విశాఖనే రాజధాని అనే ప్రకటనలు చేస్తున్నారు. అమరావతిని మార్పు చేయాలనుకున్న తర్వాత ఏపీ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడుల్ని కోల్పోయింది. ఇమేజ్ కూడా పోయింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు.
విశాఖ రాజధాని కాకపోతే ప్రత్యేక రాష్ట్రమంటూ ఇప్పటికీ విభజన బీజం !
ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపిక చెందిన ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖ ఒక్కటే రాజధాని అనే ప్రకటనలు చేస్తున్నారు. రాజధానిగా విశాఖ లేకపోతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఉత్తరాంధ్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. వారి ప్రకటనలను వైసీపీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఖండించలేదు. అంటే.. వ్యూహాత్మకంగానే ఆ ప్రకటనలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో న్యాయరాజధానిని కర్నూలులో పెట్టే ఆలోచన విరమించుకున్నామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ లాయర్ రికార్డెడ్‌గా చెప్పారు. ఇప్పుడు న్యాయరాజధాని.. లెజిస్లేటివ్ రాజధాని అనేవే లేవని.. అంతా విశాఖ రాజధాని అని జగన్ వెళ్లి విదేశీ ప్రతినిధుల ముందు ప్రకటించినట్లయిందని అంటున్నారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ ను మారిస్తే రాజధాని మారిపోతుందా ?
సీఎం ఎక్కడి నుంచి పరిపాలించాలన్నది సీఎం ఇష్టమని పలుమార్లు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. ఆ సిద్ధాంతం ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్నికోర్టులు కూడా అడ్డుకోలేవు. కానీ శాఖల్ని మాత్రం మార్చలేదు. అమరావతినే రాజకీయంగా రాజధానిగా ఉంటుందని అంటున్నారు. విశాఖ నుంచి జగన్ పరిపాలన చేసుకోవచ్చు కానీ అది రాజధాని కాదని అంటున్నారు. అన్ని న్యాయపరమైన చిక్కులు పరిష్కరించుకున్న తర్వాత మరో బిల్లు పెట్టి ఆమోదించుకున్న తర్వాతనే మూడు రాజధానులు లేదా విశాఖ రాజధాని సాధ్యమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఘటనల్ని దృష్టి మళ్లించడానికేనని ఎవరికైనా అర్థం అయిపోతుంది. అంటే.. రాజకీయ అంశాల డైవర్షన్ కోసం రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరించడం జగన్ నైజంగా మారిందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.