పీఆర్సీ వివాదానికి ముగింపు పలికేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సీఎం పలు సూచనలు చేశారు. ప్రాక్టీకల్‌గా ఆలోచించాలని ప్రభుత్వం మోయలేని విధంగా భారం మోపకూడదన్నారు. ఉద్యోగ నేతలు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నానని… సాధ్యమైనంత వరకూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని.. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. అయితే ఎంత పీఆర్సీ ఇస్తామన్నదానిపై సీఎం జగన్ ఎలాంటిప్రకటన చేయలేదు.
రెండు, మూడు రోజుల్ోల పీఆర్సీ ప్రకటన చేస్తామని ఉద్యోగ నేతలకు సీఎం జగన్ చెప్పి పంపించారు. అంటే ఉద్యోగుల అనుమతి లేకుండానే పీఆర్సీ ఎంత మొత్తమో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. పే రివిజన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఇంత వరకూ బయట పెట్టలేదు. కానీ కార్యదర్శుల కమిటీ రిపోర్టును మాత్రం బయట పెట్టారు. ఆ రిపోర్టు ప్రకారం 14.29 మాత్రమే ఫిట్మెంట్ ఇస్తారు. ప్రభుత్వం దీనికే అంగీకరించాలని పట్టుబడుతోంది. అయితే ఇప్పటికే పలుమార్లు సమావేశపరిచి ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. ఇక తాము సీఎంతోనే చర్చిస్తామని స్పష్టం చేయడంతో సీఎం వారితో చర్చలు జరిపారు.
ఇక పీఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరిపే అవకాశం లేదు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఎంత ఇవ్వాలనుకుంటుందో అంత ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్యోగులు ఏం చేస్తారన్నది వారి ఇష్టానికే వదిలేశారు. సానుకూల దృక్పథంతో ఉండాలని సీఎం జగన్ చెప్పి పంపించడం అందుకేనని అంటున్నారు. మొత్తంగా ఉద్యోగులను జగన్ మెప్పిస్తారో… లేదో రెండు , మూడు రోజుల్లో చూడాలి.