వైఎస్ జగన్… తనకు నచ్చని పని ఎవరు చేసినా సరే నిర్ధాక్షిణ్యంగా ఉంటారని, ఒక్కసారి తనను కాదని నిర్ణయం తీసుకుంటే ఎంత దగ్గర వారైనా సరే చేరదీయరని వైసీపీ నేతలు అంటుంటారు.
కానీ, కాలం ఎదురు తిరిగితే ఎంతటి వ్యక్తి అయినా వెనక్కి తగ్గాల్సిందేనని… అహం తలకెక్కించుకున్న పాలకులు ఎందరో కాలగర్భంలో కలిసి పోయారని గుర్తు చేస్తున్నారు. అయితే, తనను ఓడించేందుకు చంద్రబాబుతో జతకట్టిన బీజేపీ విషయంలో జగన్ పగ పెంచుకుంటారని అంతా భావించారు. బీజేపీతో దూరంగా ఉంటారని… ఇండియా కూటమితో వెళ్తారేమో అని అంతా భావించారు.
జగన్ ప్రతిపక్ష పార్టీగా నిజాయితీగా ఉంటే అదే చేసేవారని కానీ జగన్ కు బీజేపీతో పనులుండటం వల్ల బీజేపీని ప్రసన్నం చేసుకోవటానికి స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారని విశ్లేషకులు అంటున్నారు. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ పై ఉన్నారు. బీజేపీ కన్నెర్ర చేస్తే జగన్ కు కష్టాలు తప్పవని ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సమయంలో జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే సాహసం చేయలేకపోయారని… ప్రజాపక్షంగా కాకుండా, టీడీపీ పొత్తులో ఉన్న బీజేపీకే మద్ధతిచ్చారని అంటున్నారు.
కేసుల నుండి బయటపడటమే జగన్ ముఖ్యమైన ఎజెండా… సీఎంగా ఉన్నా, ఓడిపోయిన తన ఆస్తులు, కేసులపైనే తనకు ఎక్కువ మక్కువ. ఇప్పుడు కూడా అదే అంశం తేటతెల్లమైందని, జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని టీడీపీ నేతలంటున్నారు.