వైసీపీ ఎమ్మెల్యేలు నైతికత కోల్పోయారు. కనీస విలువలు పాటించని ప్రజాప్రతినిధులుగా పరువు పోగొట్టుకున్నారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పి రహస్యంగా రిజిస్టర్ లో వచ్చి అసెంబ్లీకి హాజరైనట్లుగా సంతకాలు చేసి వెళ్లారు. ఈ వ్యవహారాన్ని స్పీకర్ బయట పెట్టడంతో అందరూ ఔరా అనుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఐపాడ్, అరకు కాఫీ గిఫ్టులు కూడా వచ్చి పట్టుకెళ్లారు.
ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ప్రజలు వారికి ఇచ్చిన బాధ్యతల్ని వారు నిర్వర్తించడం లేదు. కానీ వారు తమకు రావాల్సిన జీతాలను మాత్రం తీసుకుంటున్నారు. ఇతర సౌకర్యాలు ఏమైనా ఉంటే వాటినీ వదిలి పెట్టకుండా తీసుకుంటున్నారు. దీని వల్ల వారి నైతికత ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఒక్క జగన్ కు మినహా అందరికీ అసెంబ్లీకి వెళ్లాలనే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పట్టుదల.. తాను సభలోకి వెళ్తే తట్టుకోలేనన్న భావనతో ఆయన దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. జగన్ మనస్థత్వం ఎలా ఉంటుందంటే.. తాను వెళ్లకుండా ఇతరులు వెళ్తే ప్రభుత్వంపై పోరాడి తన కన్నా వాళ్లే బెటర్ అని ఎక్కడ పేరు తెచ్చుకుంటారోన్న అభద్రతా భావం ఉంటుంది. అందుకే ఆయన ఎవర్నీ వెళ్లనీయరు. గతంలో తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా పోనివ్వలేదు.
జగన్ తీరు వల్లనే ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల ముందు చులకన అవుతున్నారు. ఈ ఎమ్మెల్యేల తీరును ఎథిక్స్ కమిటీకి నివేదిస్తారు. ఆ ఎమ్మెల్యేలను ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యేకంగా తీసుకునే చర్యల కన్నా.. ప్రజల ముందు వారి నిర్వాకాలు పెట్టడమే అసలైన శిక్ష. ఈ పని అయ్యన్నపాత్రుడు చేసేశారు.