ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా థియేటర్ ల టికెట్ రేట్లు భారీగా తగ్గించేలా జగన్ తీసుకున్న నిర్ణయం పై ప్రజల నుంచి పెద్దగా సానుకూలత రాకపోగా సినీ పరిశ్రమ నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమ తనను కాదని చేయడం లేదన్న ఈగో తోనే జగన్ సినీ పరిశ్రమ మీద ఈ విధంగా పగ తీర్చుకున్నాడా అన్న వ్యాఖ్యలు కూడా అంతర్గతంగా కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా థియేటర్ వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
టికెట్ రేట్లు భారీగా తగ్గించిన జగన్ ప్రభుత్వం:
సినిమా థియేటర్లు నడవడం కష్ట పూరితము, పైగా అంత లాభసాటి కాని వ్యవహారము అయిందన్న మాట చాలా కాలంగా వినిపిస్తోంది. 90వ దశకంలో ఆంధ్రప్రదేశ్లోని పలు టౌన్ లలో ప్రధాన థియేటర్ లు గా ఉన్న చాలా థియేటర్లు ఇప్పుడు కళ్యాణ మండపాలు గా మారిపోవడమో, షాపింగ్ కాంప్లెక్స్ గా రూపాంతరం చెందడమో జరిగింది. ఇప్పటికే ఓ టి టి, డిటిహెచ్ తదితర సమస్యలతో సతమతమవుతున్న ఎగ్జిబిటర్లు వ్యవస్థ పై జగన్ తీసుకున్న తాజా నిర్ణయం పిడుగు పాటు గా మారింది. టికెట్ రేట్లు భారీగా తగ్గించడం, పైగా టికెట్ రేట్ ల ను ఎప్పుడు కావలిస్తే అప్పుడు ప్రభుత్వం నిర్ణయించే వెసులుబాటు కల్పించేలా ఉత్తర్వులు చేయడం ఎగ్జిబిటర్ లకు మింగుడు పడడం లేదు. సరిగ్గా తమ సినిమా విడుదలయ్యే సమయానికి స్థానిక వైఎస్సార్సీపీ నేతలో, రాష్ట్రస్థాయి వైఎస్సార్సీపీ నేతలో తమను బెదిరించగలిగేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయని, ఇదే పద్దతి కొనసాగితే తాము వ్యాపారం చేసుకోలేమని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.
జగన్ పాలనలో సినిమా టికెట్లు కాకుండా రేట్ తగ్గిన ఒక్క నిత్యవసర వస్తువైనా ఉందా అన్న ప్రశ్నలు
వినోదం ఇవాళ నిత్యవసర వస్తువు అయిపోయింది. కాబట్టి జగన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే ప్రజల నుండి జగన్ పై సానుకూలత రావాల్సి ఉంది. కానీ ఆశ్చర్యంగా ప్రజల్లో కూడా ఇది తమ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, వేరే రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతున్న సినిమా వాళ్లను తమ చెప్పు చేతల కింద ఉంచుకోవడానికి జగన్ తీసుకున్న నిర్ణయం ఇది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు గత రెండేళ్లలో విపరీతంగా పెరిగిపోయాయి. నిజంగా జగన్ కి ప్రజల ఆర్థిక పరిస్థితి పై చిత్తశుద్ధి ఉంటే నిత్యవసర వస్తువులు పెట్రోల్ వంటి వాటిపై రాష్ట్ర స్థాయిలో విధిస్తున్న పన్నులను తగ్గించి ఉండేవారని వారు అంటున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్లో మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచిన జగన్ ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ రేట్లను కూడా అదేవిధంగా పెంచిందని, చెత్త పై పన్ను వేయడానికి కూడా సిద్ధమై పోయిందని, మొన్నటి వరకూ ఇంటి అద్దె ఆధారంగా కట్టవలసి వచ్చిన ప్రాపర్టీ టాక్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ధర ఆధారంగా కట్టేలా సవరణలు చేయడం ద్వారా మధ్యతరగతి నడ్డి విరిచే విధంగా జగన్ ప్రవర్తించారని, ఇన్ని విధాలుగా ప్రజల మీద ఆర్థిక భారం వేసిన జగన్ కేవలం సినిమా టికెట్ల రేట్లు మాత్రం ప్రజల కోసం తగ్గించారు అని అంటే ఎవరు నమ్ముతారని ప్రజలలో ఒక అభిప్రాయం వినిపిస్తోంది.
నిజంగా థియేటర్ల వ్యవస్థ ప్రక్షాళన పై చిత్తశుద్ధి ఉంటే జగన్ చేయవలసిన పనులు ఇవే:
నిజంగా థియేటర్ల వ్యవస్థ ప్రక్షాళనకు పై చిత్తశుద్ధి ఉంటే జగన్ చేయవలసిన మొదటి పని, సినిమా టికెట్ల కొనుగోలు మరియు అమ్మకాలు వ్యవహారాలను విదేశాల్లో మాదిరిగా పూర్తిగా ఆన్లైన్ చేయడం. దీని ద్వారా బ్లాక్ మనీ తో సహా అనేక అడ్డగోలు వ్యవహారాలకు కళ్లెం వేసే అవకాశం వస్తుంది. ఇక రెండవది తన సొంత ఇగో తృప్తి పరచుకోడానికి కాకుండా రేట్ ఉన్నతంగా తగ్గించడం కాకుండా, సినిమా టికెట్ల రేట్లు ఏ మేరకు ఉండవచ్చు అన్న అంశాన్ని స్టడీ చేయడానికి ఒక కమిటీ వేయడం. కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు శాస్త్రీయంగా ప్రాక్టికల్ గా టికెట్ల రేట్ల ను నిర్ధారించడం. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, తమిళ స్టార్ సూర్య సహా అనేకమంది స్టార్ హీరోలు తమ సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడానికి ఈ మధ్య వెనుకాడడం లేదు. కాబట్టి సినిమా హీరోల ను లక్ష్యంగా చేసుకోవడం కోసం థియేటర్ల వ్యవస్థను దెబ్బ తీస్తే, దానిద్వారా హీరోల కంటే ఎక్కువగా ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు, థియేటర్లను నమ్ముకుని వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారులు పూర్తిస్థాయిలో దెబ్బతింటారు. దాని ప్రభావం తిరిగి ప్రభుత్వం పైన ప్రతికూలంగా పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సరైన, సహేతుకమైన నిర్ణయం తీసుకుని థియేటర్లను జగన్ బతికిస్తాడా , లేక తమ సొంత భారతి సిమెంట్ రేట్లు, ఇతర నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ ఎంతగా పెరిగినా, సినిమా టికెట్ల రేట్లు మాత్రం థియేటర్లో స్కూటర్ పార్కింగ్ రేటు కంటే తక్కువ ఉండాలని మొండిపట్టు పడతాడా అన్నది వేచి చూడాలి.