అధికారం కోల్పోగానే వైసీపీ అధినేత జగన్ రెడ్డి గగ్గోలు మొదలైపోయింది. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఏడుపు షురూ అయింది. పోలింగ్ తదనంతరం రాష్ట్రం రావణాకాష్టంలా మారి తగలబడుతుంటే చడీచప్పుడు చేయని జగన్… ఫలితాల తర్వాత ఒకటి, రెండు సంఘటనలను చూపుతూ వ్యవస్థలు కుప్పకూలాయని పేర్కొనడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని… టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం వచ్చిందంటూ జగన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంకా ప్రమాణస్వీకారం చేయనేలేదు. ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో బిజీబిజీగా గడుపుతుండగా…బాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని జగన్ ట్వీట్ ఆయన కడుపుమంటకు నిదర్శమని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.
వైసీపీ హయాంలో నిత్యం ప్రత్యర్ధి నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులతో ఫ్యాక్షన్ రాజకీయాలను జగన్ మళ్ళీ పరిచయం చేస్తున్నారని ఆరోపణలను మూటగట్టుకున్నారు. జగన్ విధానాలపై విసుగెత్తిన ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి కర్రుకాల్చి వాత పెట్టారు. నూతన ప్రభుత్వం ఇంకా బాధ్యతలు కూడా చేపట్టలేదు. అయినా అప్పుడే టీడీపీపై జగన్ రెడ్డి నిందలు మోపడం స్టార్ట్ చేశారని విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే రాష్ట్రంలో వ్యవస్థలు అదుపు తప్పాయని జగన్ వ్యాఖ్యానిస్తే దానిని ప్రజలు విశ్వసిస్తారా..? వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడుతోన్న జగన్.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా కార్యకర్తల గురించి పట్టించుకున్నారా? అధికారం కోల్పోగానే కార్యకర్తలు , ప్రజాస్వామ్యం అని పలవరిస్తే ఏం లాభం అంటూ జగన్ తీరుపై ఆ పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.