మంగళవారం రాత్రి దాదాపుగా గంట సేపు అమిత్ షాతో సమావేశమైన ఏపీ సీఎం జగన్ బుధవారం ఉదయం మరోసారి అరగంట సేపు సమావేశమయ్యారు. కొన్ని అంశాలపై మరింతగా చర్చించాల్సి ఉండటంతో ఉదయమే రమ్మని అమిత్ షా చెప్పడంతో.. జగన్ .. ఈ ఉదయం మరోసారి ఆయన నివాసానికి వెళ్లారు. నిన్న జరిగిన భేటీలో విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి లేరు. కానీ ఇవాళ మాత్రం.. జగన్ తోపాటు అమిత్ షా వద్దకు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా వెళ్లారు. ఈ రోజు అమిత్ షా దృష్టికి ప్రధానంగా కోర్టుల్లో వస్తున్నఎదురు దెబ్బల అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. కోర్టుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని.. అన్నింటిలోనూ స్టేలు వస్తున్నాయని అందువల్ల పాలన సరిగ్గా చేయలేకపోతున్నామని చెప్పినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో.. అమరావతి భూముల్లో భారీ ఆక్రమాలు జరిగినా.. చర్యలు తీసుకోకుండా కోర్టు ఉత్తర్వులివ్వడంపైనా ఆయన హోంమంత్రికి ప్రత్యేకంగా విజ్ఞాపనా పత్రం అందించినట్లుగా చెబుతున్నారు. వీటితో పాటు విభజన హామీలు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వంటి వాటిపై చర్చించినట్లుగా చెబుతున్నారు.
అమిత్ షాతో భేటీ కంటే ముందే.. జగన్ .. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా తిరుమలకు వెళ్లే జగన్మోహన్ రెడ్డి అక్కడ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జగన్ ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో అనూహ్యమైన నిర్ణయాలు ఢిల్లీ నుంచి వస్తాయని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో వైసీపీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి.