జగన్ రెడ్డికి రాజకీయం అంటే ఒక మాటను పదే పదే చెప్పి ప్రజలంతా అదే అనుకుంటున్నారని తాను నమ్మేయడం. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయ్యే సరికి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇక మనం ప్రజల్లోకి వెళ్లి భరోసా ఇవ్వాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. అసలు ఆ క్యాడర్ ఎక్కడ ఉందో.. లీడర్లు ఎక్కడ ఉన్నారో ఆయన చూసుకోవడం లేదు. జిల్లాల మీటింగ్లు పెడితే ముఖ్య నేతలు ఒక్కరిద్దరు కూడా కనిపించడం లేదు. ప్రతి జిల్లాలోనూ అదే పరిస్థితి. గుంటూరు మీటింగ్ పెడితే ఎవరొస్తారయ్యా అంటే విడదల రజనీ తప్ప ఎవరూ లేరు. కృష్ణా మీటింగ్ పెడితే దేవినేని అవినాష్.. అనంతపురం మీటింగ్ పెడితే.. చిత్తూరు మీటింగ్ పెడితే ఎవరికీ తెలియని నేతలు హాల్లో కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్ ఇప్పటికీ గుర్తించడం లేదు.
ముందు పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారేమో కానీ ఆయన పార్టీ కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. వారంలో రెండు రోజులు ఓ నియోజవర్గంలో పడుకుంటానని చెబుతున్నారు. పడుకోవాడనికి.. మేలుకోవడానికి ఆయన అక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే. చేయాల్సింది పార్టీ నాయకుల్ని యాక్టివ్ చేయడం. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి అన్నట్లుగా ఉండే ఎవరు ఉంటారు ?. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అహం, సైకో సంతృప్తి పొందడానికి చేసిన రాజకీయంతో ఇప్పుడు పార్టీ క్యాడర్ సఫర్ అవుతున్నారు. వారికి హైకమాండ్ నుంచి ఎలాంటి భరోసా రావడం లేదు. న్యాయవిభాగం మొత్తం ఎత్తిపోయింది. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది..మనకు రెడ్ కార్పెట్ వేస్తారని ఏదో భ్రమ రాజకీయాలు చేస్తూ ఎంత కాలం పార్టీ నేతల్ని ఇబ్బంది పెడతారు ?
పదేళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసినవి చిన్న చిన్న ఘోరాలు కాదు. అన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి బయటకు వచ్చే కొద్దీ ప్రజలు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. తాజాగా రెవిన్యూ సదస్సుల ప్రారంభమవుతున్నాయి. ఊళ్లల్లో ఎంత మంది ఆస్తులను వైసీపీ నేతలు లాక్కున్నారో స్పష్టత వస్తుంది. ఇప్పటికే కాకినాడ పోర్టును ఎలా లాక్కుకున్నారో కళ్ల ముందే ఉంది. ఇతర చిన్న రైతులు, బలహీనులపై ఎలా దాడులు చేశారో వచ్చే నెల రోజుల్లో బయటపడనుంది. ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే.. తాను పడేసిన చిల్లర ఇప్పుడు రావడం లేదని ప్రజలు బాధపడుతూంటారని ఆయన ఫీలవుతున్నారు. కానీ ఆ చిల్లర కూడా కొట్టేశారన్న కోపంతోనే ప్రజలు ఓట్లేయలేదు. ఈ విషయం తెలుసుకుని రాజకీయం చేయలేకపోతున్నారు. ఒకే స్క్రిప్టు చదువుకుంటూ… సేమ్ టెంప్లెట్ రాజకీయాలు చేసుకుంటున్నారు.