బడుగు బలహీనవర్గాలకు అమలు చేసిన సంక్షేమ పధకాలు, బిసి విద్యార్ధులకు ఫీజు రీయెంబెర్సుమెంటులు, ఆరోగ్యశ్రీ పధకంద్వారా కనబరచిన మానవీయ ఆర్ధ్రత, తటపటాయింపులు లేని నిర్ణయాత్మకత, మొదలైన విశేష గుణాల వల్ల వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ప్రజల్లో పెరిగిన ఆదరాభిమానాలు, దిగ్భ్రాంతికరమైన ఆయన మరణం వల్ల పెల్లుబికిన సానుభూతి ఆవిరైపోతున్నాయి.
ఇందుకు బాధ్యత ఆయన కుమారుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిదే.
గతఎన్నికలలో గెలుపు తెలుగుదేశానిదే అయినా జగన్ పార్టీకి పోలైన ఓట్లు సంఖ్య, శాతాలు చూస్తే చంద్రబాబు సాధించిన విజయాన్ని ”చావుతప్పు కన్నులొట్టబోయినంతటి గెలుపు”అనవచ్చు. జగన్ ఓటమిని ”కర్ణుడి చావుకున్నన్ని కారణాలుగా”చెప్పుకోవచ్చు.
ఆ పరిస్ధితి ని నేపధ్యంగా తీసుకుని ఎత్తుగడలు, వ్యూహాలు రూపొందించుకోకుండా చంద్రబాబు నాయుడు మీద వున్న ద్వేషాన్నే ఏకసూత్రంగా చేసుకుని కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైపోవడం జగన్ చేస్తున్న ఘోరమైన తప్పిదం. రాజకీయ ప్రత్యర్ధిని వ్యక్తిగత శత్రువుగా జగన్ పరిగణించే ధోరణిలో ”నా వస్తువు పట్టుకుపోయాడు. అది తిరిగివచ్చే వరకూ ఊరుకునేదిలేదు” అనే పిల్లవాడి మంకుతనం వుంది.
ప్రజల్లో వైఎస్ఆర్ కి వున్న పలుకుబడి చూసో, ఆయన పట్ల అభిమానంతోనో, జగన్ పార్టీలో చేరినవారికి, ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారికి జగన్ ఏకపక్షధోరణులు తమ రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయగలవన్న ఆలోచనలు మొదలయ్యాయి.
దీన్నే అదనుగా చేసుకుని చంద్రబాబు సామ, దాన, బేధ, దండోపాయాలతో ఎమ్మెల్యేల ఆకర్ష క్రతువు మొదలుపెట్టారు. నిజానికి ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించినదే. తెలంగాణాలో కెసిఆర్ కొనసాగిస్తున్నదే.
ఆ ఇద్దరూ కూడా తమ ప్రత్యర్ధి పార్టీ అయిన తెలుగుదేశానికి భవిష్యత్తు లేదని ఎమ్మెల్యేలను నమ్మించడం ద్వారా వారి వారి పార్టీల్లోకి ఫిరాయింపులు చేయించుకోగలిగారు. ఇపుడు కూడా చంద్రబాబు అదేపని చేస్తున్నారు. అయితే జగన్ ధోరణి వల్ల ఆయన పార్టీ ఎమ్మెల్యేలు విసిగెత్తిపోవడంతో తెలుగుదేశం పని సుళువైపోతోంది.
అపుడు వైఎస్ఆర్ కాని, ఇపుడు తెలంగాణాలో కెసిఆర్ కాని, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకాని ప్రత్యర్ధి పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో ”కట్టి పడేసుకోడానికి” కారణం ఆయా ఎమ్మెల్యేలకు సొంత పార్టీ లో వున్న అసంతృప్తులు మాత్రమే కాదు! అనేక ప్రలోభాలు కూడా వున్నాయి… వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ కావచ్చు…అప్పులు పాలైపోయి ఆదాయ వనరులు బిగుసుకుపోయినవారు కాస్తతేరుకోవడానికి వారి సిఫార్సులపై కాంట్రాక్టులు దక్కేలా చూస్తమన్న వాగ్దానం కావచ్చు…ఇలా విసిరిన వలలు ఫిరాయింపుల వెనుక లేవంటే అది నిజంకాదు.
ఇందులో అధికారపక్షం అనైతికత ఎంతవుందో ప్రతిపక్షం అసమర్ధత అంతకంటే ఎక్కువే వుంది. చంద్రబాబుని ఆడిపోసుకునే ఏకైక కార్యక్రమంగా శాసనసభను మార్చేసిన జగన్ ప్రజాసమస్యల పట్ల నిర్మాణాత్మకంగా చర్చను మళ్ళించిన సందర్భం లేనేలేదు. చంద్రబాబు మీద వ్యక్తిగతంగా పెంచుకున్న శత్రుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలకే విసుగు పుట్టిస్తోంది. ఈ ఏకసూత్ర విధానం వల్ల తమకు సొంత నియోజక వర్గాల్లో భవిష్యత్తు ఉండదన్న భయం మొదలైంది. దీన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు.
ఎత్తుగడలతో అధికార పక్షాన్ని ఉచ్చులో బిగించి రాష్ట్రంలో, దేశంలో మన్ననలు పొందే అవకాశం వున్న శాసన సభకు, రాజకీయ సభలకు, రోడ్ సైడ్ మీటింగులకు, రాష్ట్రపతి, గవర్నర్ వంటి రాజ్యాంగ అధిపతులతో జరిపే సమావేశాలకు, మీడియా సమావేశాలకూ తేడా లేనట్టే జగన్ ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు మీద ఫిర్యాదులు తప్ప మరో ఎజెండా ఏదీ తనకు లేదని చాటుకోవడానికే ఏ వేదికనైనా ఆయన వాడుకుంటూ వుంటారు. ఈ ధోరణి కరెక్టు కాదని ఆయనకు సూచించే నాయకులు లేదు…ఉన్నా తనకు తోచిందేతప్ప ఇతరులమాట వినే అలవాటు జగన్ కు లేదు అని బయటకు వచ్చేసిన వారు చెబుతున్నారు. పట్టూ విడుపూ లేని ఈ గుణం వల్లే ఫిరాయింపులను నిరోధించడం జగన్ వల్ల కావటం లేదు. పైగా సంతలో పశువులను కొన్నట్టు తన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారన్న విమర్శలో, చంద్రబాబు మీద దూషణలతో పాటు ఎమ్మెల్యేలను ఏమంటున్నారో ఆలోచించుకోలేని ఆవేశం ఆయనది..
పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళకుండా, పార్టీనే పటిష్టంగా నిర్మించుకోకుండా బాబు మీద విమర్శలతో కాలంగడిపేసే పార్టీ ఏమి సాధిస్తుందో జగన్ కే తెలియాలని ఆయన పార్టీ వారే గొణుక్కోవడం మొదలైంది..స్ధానిక రాజకీయ సమీకరణలవల్లో, కుల సమీకరణలవల్లో గ్రౌండ్ లెవెల్లో జగన్ పార్టీ కార్యకర్తలు తమకు మరో ప్రత్యామ్నాయం దొరికేవరకూ పార్టీ మారరు…అదేసమయంలో వారు తమపార్టీ పోకడల పట్ల సంతృప్తిగా కూడా లేరు!
రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు వుండవు అన్నది ఒక నానుడి..జగన్ వ్యవహార శైలి వల్ల ఆనానుడి నిజమౌతుందేమో అనిపిస్తోంది!