ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడరు. కానీ ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రెడ్డి తీరు మాత్రం భిన్నం. ఆయన ప్రజల్ని కలవరు.. వాళ్లు వచ్చినా కలవరు. తనను తాను ఓ రేంజ్ చక్రవర్తిగా భావించుకుటూ ఉంటారు. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఆయనకు ప్రజల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. నాలుగేళ్ల కాలంలో మొత్తం అవ్యవస్థ పాలన కారణంగా సొంత పార్టీ క్యాడర్ మాత్రమే కాదు.. అన్ని వర్గాలూ అసంతృప్తిగా ఉన్నాయి. వారిని సంతృప్తి పరిచేందుకు ఏదో ఒకటి చేయాల్సి ఉంది. లేకపోతే కోర్ ఓటు బ్యాంక్ దెబ్బతింటుందన్న ఆందోళనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
గత ఏడాదిన్నరగా జగన్ జనంలోకి వెళ్తారని చెబుతున్నారు. జిల్లాల పర్యటనలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పదిహేను రోజులు జిల్లాల పర్యటనలోనే ఉంటారని కూడా ప్రకటనలు చేశారు. ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఎన్నికల షెడ్యూల్ ఎలా చూసినా మరో తొమ్మిది నెలల్లో రానుంది. అంటే ఈ లోపే అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి. సొంత పార్టీ క్యాడర్ కు పెండింగ్ ఉన్న బిల్లులన్నీ ఇవ్వడంతో పాటు వారికి ఇక ముందు భవిష్యత్ ఉంటుందని భరోసా ఇవ్వాలి. అలాగే దాడులకు గురైన వర్గాలకు మేలు చేసేలా ఏదో ఓ తాయిలం ప్రకటించాలి. వీటన్నింటికీ అప్పులు వెదుక్కోవాల్సి ఉంది.
ఇటీవల జగన్ హఠాత్తుగా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు సమాచారం పెద్దగా ఎవరికీ తెలియకున్నా కొన్ని గ్రామాల ప్రజలు ఆయన కాన్వాయ్ కు అడ్డం పడే ప్రయత్నాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అలాంటి సమస్యలు ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి. వైసీపీలో గ్రామస్థాయి పదవులు పొందిన వారు చేసిన అరాచకానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారి బాధితులకూ గ్రామాల పర్యటనకు వెళ్తే చుట్టు ముట్టే అవకాశం ఉంది.
జిల్లాలు, గ్రామాల పర్యటనకు వెళ్తే పరదాలతో పని కానిచ్చేస్తే ప్రయోజనం ఉండదు. ప్రజలతో మాట్లాడాలి. అలా మాట్లాడటంవల్లే ఎక్కువ సమస్యలు వస్తాయని ఐ ప్యాక్ గుర్తించిందని అందుకే… నేరుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తే మంచిదనే సలహాను ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రకారం సీఎం జగన్ రెడ్డి.. మరో రెండు నెలల ఇలా సాగదీసి ఒకే సారి జిల్లాల ప్రచారం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని అంటున్నారు.