వల్లభనేని వంశీ కొద్ది రోజులుగా ఏమీ మాట్లాడటం లేదు. హైకమాండ్ నుంచి సందేశం వస్తే చాలు బూతులతో విరుచుకుపడేందుకు ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. లోకేష్ గన్నవరం పర్యటనకు వస్తున్నారని.. బహిరంగసభ పెట్టబోతున్నారని తెలిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లారు… పారిపోయారని అంటారని చెప్పి మళ్లీ .. సభ రోజు గన్నవరం వచ్చారు కానీ మీడియాతో మాట్లాడలేదు. లోకేష్ పై ఎలాంటి ఆరోపణలు చేలేదు. నోరు చేసుకోలేదు. ఎందుకా అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఓ వార్డు స్థానానికి ఎన్నిక జరిగింది. అక్కడ వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా.. వైసీపీకే మెజార్టీ వస్తుంది. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా అక్కడ నివసిస్తూ ఉంటుంది. అక్కడ వంశీ తన అభ్యర్థిని నిలబెట్టారు. చాలా ఖర్చు చేశారు. కానీ అక్కడ టీడీపీ అభ్యర్థే విజయం సాధించారు. ఇది వైసీపీ పెద్దలను మైండ్ బ్లాంక్ చేసిందని చెబుతున్నారు. అక్కడ ఉన్న పరస్థితుల్ని ఆరా తీస్తే.. పూర్తిగా వంశీపై వ్యతిరేకత వల్లనే ఆ ఫలితం వచ్చిందని నిర్ధారించుకున్నారని అంటున్నారు.
ఈ పరిణామంతో పాటు యార్లగడ్డ వెంకట్రావును కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయక… మొత్తంగా రెచ్చగొట్టి బయటకు పంపేశారన్న ఆగ్రహం హైకమాండ్ లో కనిపిస్తోంది. యార్లగడ్డ టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీలోనే ఉండేవారని.. కానీ ఉండలేని పరిస్థితుల్ని సృష్టించారని గన్నవరంలో పాత వైసీపీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలన్నింటిపై .. వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం టిక్కెట్ పైనా ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంటోది. కారణం ఏదైనా ప్రస్తుతం గన్నవరం వంశీకి గడ్డు పరిస్థితులు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.