జగన్మోహన్ రెడ్డికి పాస్ పోర్టు రాలేదు. లండన్ పోలేకపోయారు. అలాగని విజయవాడలో ఉండలేకపోయారు. బెంగళూరు వెళ్లిపోయారు. రాత్రికి రాత్రి ఓ ట్వీట్ పడేశారు. అది చాట భారతం అంత ఉంది . అందులో చేసిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ చేశారు. సాక్షిలో రోజూ చెప్పిందే..మళ్లీ చెప్పారు. అదే గేట్లు.. అదే నది… అదే సమీక్ష… అదే మళ్లింపు. అంతేనా… విజయవాడలో ఒక్కరికీ సాయం అందలేదట. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయట.
విజయవాడలో ఏం జరుగుతుందో విజయవాడ వాసులకు తెలుసు. మీడియాలో చూపిస్తున్న ఇతర ప్రాంతాల వాళ్లకు తెలుసు. కానీ జగన్ రెడ్డి తాను చెప్పింది.. సాక్షి రాసింది మాత్రమే జనం నమ్ముతారని అనుకుంటారేమో కానీ అసలు కళ్ల ఎదుట జరుగుతున్న వాటిని కూడా జరగడం లేదని రాసేస్తారు. ఇంత ఘోరమైన రాజకీయం… ఎలా చేయాలనిపిస్తుందో కానీ అదే చేస్తారు. పాస్ పోర్టు పని మీద రెండు సార్లు అమరావతికి వచ్చి కొద్ది సేపు నీళ్లల్లో షో చేసి వెళ్లిన ఆయన.. రెయింబవళ్లు కష్టపడుతున్న వారిని కించ పరుస్తున్నారు.
కుట్ర రాజకీయాల నిర్వాకంలో ఒక్కొక్క కుట్ర బయటపడుతున్నప్పుడు .. ఎలాంటి ఎదురుదాడి చేయాలో అని.. ఆలోచించుకుని బురద పోగేసుకుని చల్లేస్తున్నట్లుగా విమర్శిస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా ఉన్న ప్రతిపక్షం కాబట్టి అవకాశాల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాల్సింది. నిజమైన ప్రజాకోణంలో ప్రభుత్వాన్ని మరింత బాధ్యతాయుతంగా చేసేలా ఒత్తిడి చేయాల్సింది. అలా కాకుండా.. బెంగళూరులో కూర్చుని.. టైంపాస్ విమర్శలు చేస్తూంటే.. ప్రజల్లో మరింత చులకన అవుతారు.