దొనకొండ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేయబోతున్నాడని అసెంబ్లీలో పరిశ్రమల శాఖ మంత్రి ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..
Click here: https://www.telugu360.com/te/ycp-neglecting-amaravati-to-develop-donakonda/
ఇటీవల ప్రపంచ బ్యాంకు అమరావతి ప్రాజెక్టు నుండి వైదొలగడం, అలాగే రుణాలిస్తామని ముందుగా అంగీకరించిన మరి కొన్ని బ్యాంకులు అమరావతి ప్రాజెక్టు విషయంలో పునరాలోచించుకోవడం చూసి ప్రజల్లో అమరావతి స్థానంలో దొనకొండ కు రాజధాని తరలించే వ్యూహం ఏమైనా వైఎస్సార్సీపీ చేస్తోందా అని అనుమానాలు వచ్చాయి. పైగా విభజన ప్రకటించిన సమయంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు చాలామంది బిజెపిలో లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వారంతా అప్పట్లో వారికి ఉన్న సమాచారం మేరకు దొనకొండ లో భారీగా పెట్టుబడులు పెట్టారని, అందుకే ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరు తో నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి పనులను దొనకొండ కి మార్చబోతున్నారని, తమ స్థలాలు ఉన్న చోట్ల పరిశ్రమలు వచ్చే లాగా ప్లాన్ చేస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు మంత్రి గౌతంరెడ్డి తో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు – దొనకొండ ప్రాంతాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే, బహుశా ఇప్పటి వరకు వినిపించిన ఆ గుసగుసలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి .
ఏది ఏమైనా, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే మంచిదే కానీ, రాజకీయ నాయకులు తాము గతంలో పెట్టుబడులు పెట్టిన చోట్ల, తమ స్థలాలు ఉన్న చోట్ల మాత్రమే అభివృద్ధి చేసుకోవడం కోసం అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రజలను మభ్య పెట్టడం మాత్రం సమంజసం కాదు.