ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎట్టకేలకు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ లభించింది. మంగళవారం ఆయనను కలిసేందుకు మోడీ సమయం ఇచ్చారు. తన మామ చనిపోవడంతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పులివెందులకు వెళ్లనున్న జగన్ అక్కడ్నుంచే సోమవారం ఢిల్లీకి వెళ్తారు. మంగళవారం ప్రధానితో సమావేశం అవుతారు. గత వారం హోంమంత్రి అమిత్ షాతో రెండు సార్లు జగన్ భేటీ అయ్యారు. అమిత్ షాతోభేటీ ఏ ఎజెండా ప్రకారం జరిగిందో ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు అది వ్యక్తిగత పర్యటన అని.. కేసుల నుంచి తప్పించుకునేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
అంతకు ముందు నుంచే ప్రధానితో భేటీ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోని వైసీపీ నేతలు ఈ విషయంలో తీవ్రమైన ప్రయత్నాలు చేసి.. చివరికి సక్సెస్ అయ్యారు. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓ నివేదిక సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ సర్కార్‌కు… కేంద్రం బాసటగా నిలుస్తోంది. అవసరమైనప్పుడల్లా.. అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ క్రమంలో మరింత ఆర్థిక సాయం జగన్ అడిగే అవకాశం ఉంది. అదే సమయంలో.. ఏపీలో రాజకీయ పరిస్థితులను కూడా.. ఆయన ముందు పెట్టే అవకాశం ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని భూములపై, ఫైబర్ గ్రిప్డ్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతున్నారు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు కూడా అదే డిమాండ్ చేశారు. వీటిని మాత్రం సాధించుకు రావాలన్న పట్టుదలతో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.
అయితే మంగళవారమే అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగాల్సి ఉంది. ఈ భేటీలో షెకావత్‌తో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులుపాల్గొనాల్సి ఉంది. నిజానికి ఇది వర్చువల్ భేటీ. సీఎంలు ఢిల్లీకి వెళ్లాల్సిన పని లేదు. కానీ ప్రధాని అపాయింట్మెంట్ లభించడంతో జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. జగన్ నేరుగా అపెక్స్ భేటీకి వెళ్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ మాత్రం… హైదరాబాద్ నుంచి వర్చవల్ గా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి స్వల్ప వ్యవధిలోనే… రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.