జగన్మోహన్ రెడ్డి ఏదనుకుంటే అది చేస్తారు. దానికి ప్రత్యేకంగా సాక్ష్యాలు అవసరం లేదు. ఇప్పుడు ఆయన దృష్టి శాసనమండలిపై పడిందంటున్నారు. దాన్ని రద్దు చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. దీనికి కారణం.. తాము ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బిల్లులు రెండు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడమే. ఒకటి ఇంగ్లిష్ మీడియం..మరొకటి ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కార్పొరేషన్ల ఏర్పాటు. ఈ రెండింటిలో సవరణలు కోరుతూ.. టీడీపీ బిల్లులను ఆమోదించేందుకు తిరస్కరించింది. శాసనమండలిలో మెజార్టీ ఎమ్మెల్సీలు టీడీపీవాళ్లే. టీడీపీ మద్దతు లేకపోతే.. బిల్లులు పాస్ కావు.
శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58… ఇందులో టీడీపీకి 28, వైసీపీకి 9, బీజేపీకి 2, ప్రోగ్రెసివ్ డెమాక్రటిక్ ఫ్రంట్-పీడీఎఫ్‌కు అయిదుగురు , ఇండిపెండెంట్లు ముగ్గురు, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మండలిలో వైసీపీకి మెజారిటీ రావాలంటే 2021 వరకూ ఆగాల్సిందే. అప్పటికీ దాదాపుగా 20 మంది సభ్యులు రిటైరయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకూ.. వివాదాస్పద బిల్లులు తేవాలంటే.. టీడీపీ మద్దతు కావాలి. రాజధాని మార్పు లాంటి అంశాలపై చట్టాలు చేయాలంటే.. టీడీపీ చెప్పినట్లు చేయాలి. అమరావతిని మార్చడానికి టీడీపీ ఒప్పుకోదు. అందుకే జగన్ కౌన్సిల్ రద్దు వైపు ఆలోచన చేస్తున్నారంటున్నారు.
శాసనమండలి గతంలో ఎన్టీఆర్ రద్దు చేశారు. చంద్రబాబు అదో ఖర్చు అని.. తాను సీఎం అయిన తర్వాత ఏర్పాటు చేయలేదు. కానీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆశావహులకు… పదవుల ఉపాధి కోసం మళ్లీ ఏర్పాటు చేశారు. దాన్ని చంద్రబాబు కొనసాగించారు. ఇప్పుడు.. వైఎస్ఆర్ కొడుక్కి.. ఆ మండలి అడ్డం అయిపోయింది. అయితే.. జగన్‌కు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఎన్నికల సమయంలో బుజ్జగింపుల్లో భాగంగా దాదాపు 100 మందికి శాసనమండలి టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇద్దరు మంత్రులు కూడా.. ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇప్పుడు రద్దు చేస్తే వారి పదవులు పోతాయి. అయితే జగన్ అనుకుంటే.. వీటన్నింటినీ పట్టించుకోరు. చేయాలనుకున్నది చేస్తారు.